Telangana Ministers Took Charge: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన అధికారిక నివాసం ప్రజాభవన్‌లోకి ప్రవేశించారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి అందులో అడుగు పెట్టారు. ప్రత్యేక పూజలతో గృహప్రవేశం చేశారు. అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన తన కార్యాలయంలో ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అటు మిగిలిన మంత్రులు కూడా వారి వారి ఛాంబర్లలో బాధ్యతలు స్వీకరించారు. 



కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చే వరకు ప్రజాభవన్‌ ప్రగతి భవన్‌గా ఉండేది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే ప్రగతి భవన్‌ పేరును జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌గా పేరు మార్చారు. అక్కడే ప్రజల సమస్యలు వినేందుకు ప్రజాదర్బారు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అందులోని ఓ ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించారు.



ఇప్పటి వరకు ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్‌ ఉండేవాళ్లు. ఇప్పుడు ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి దాన్ని డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా మార్చేశారు. అయితే సీఎం ఎక్కడ ఉంటారనే చర్చ మొదలైంది. ఆయన అధికారిక నివాసం కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ భవనాన్ని ఈ మధ్య పరిశీలించారు. అక్కడ అన్ని సౌకర్యాలు ఉండటం భద్రతా పరంగా కూడా అనుకూలంగా ఉందని అధికారులు భావిస్తున్నారు. దాన్ని అధికారిక నివాసంగా ఉపయోగిస్తే అక్కడ శిక్షణ సంస్థను ప్రజాభవన్‌లో ఖాళీగా ఉన్న ప్రాంతాలకు మార్చే ఛాన్స్ ఉంది. 


పలు శాఖలకు నిధులు


కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రి భట్టి విక్రమార్కకు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు శాఖలకు భట్టి నిధులు మంజూరు చేస్తూ, వాటికి సంబంధించిన దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. ఆర్టీసీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన సబ్సిడీ కింద రూ.374 కోట్ల నిధులను విడుదల చేశారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.298 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి రూ.996 కోట్లు, మేడారం జాతర ఏర్పాట్లకు రూ.75 కోట్ల నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.