Nayanthara : ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. ఎందరో నటీనటులు మరెన్నో బిజినెస్‌లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అలా కొందరు ఇటు సినిమాల్లో, అటు బిజినెస్‌లో రెండిటిలోనూ లక్ కలిసొస్తుంది. స్టార్ హీరోహీరోయిన్ అవ్వడంతో పాటు బిజినెస్ ఐకాన్స్ కూడా అయిపోతుంటారు. ఆ లిస్ట్‌లోని నటీమణుల్లో టాప్ స్థానంలో ఉండే పేరు నయనతార. ప్రస్తుతం సౌత్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నయనతార.. తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. మరోవైపు బిజినెస్‌లోనూ మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్‌గా గుర్తింపు పొందింది. దీనిపై నయన్ స్పందిస్తూ క్రెడిట్ పూర్తిగా తనది కాదని, తన భర్తదని చెప్పుకొచ్చింది.


సినిమాల్లో బిజీ..
ఎన్నో ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో.. ముఖ్యంగా తెలుగు, తమిళ పరిశ్రమల్లో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నయనతార.. తాజాగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’తో బాలీవుడ్‌లో కూడా డెబ్యూ ఇచ్చింది. హిందీలో తను నటించిన మొదటి సినిమాతోనే ఏకంగా షారుఖ్ ఖాన్‌లాంటి పెద్ద హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. దీంతో ఇప్పుడు సౌత్ మాత్రమే కాకుండా హిందీ మూవీ మేకర్స్ కూడా నయన్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే బిజినెస్ ఉమెన్‌గా కూడా ఎదిగింది నయన్. 2021లో నిర్మాతగా మారింది. అంతే కాకుండా తాజాగా సొంతంగా ఒక కాస్మటిక్ బ్రాండ్‌ను కూడా లాంచ్ చేసింది.


సొంతంగా స్కిన్ కేర్ బ్రాండ్..
2021లో తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించింది నయనతార. ఇప్పటికే ఈ బ్యానర్‌పై పలు సినిమాలు తెరకెక్కాయి. అంతే కాకుండా 2023లో పలు బిజినెస్‌లలో నయనతార పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. సొంతంగా ‘9 స్కిన్’ అనే స్కిన్ కేర్ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. ‘ఫెమీ 9’ అనే పేరుతో శానిటరీ న్యాప్‌కిన్ బ్రాండ్‌ను కూడా ప్రారంభించింది. వీటితో పాటు ‘ది డివైన్ ఫుడ్’ అనే ఫుడ్స్ బ్రాండ్‌లో పెట్టుబడులు కూడా పెట్టింది. దీంతో హీరోయిన్‌గా మాత్రమే కాదు.. బిజినెస్ ఉమెన్‌గా కూడా నయన్ సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. అందుకే బిజినెస్ టుడే విడుదల చేసిన మోస్ట్ పవర్‌ఫుల్ బిజినెస్ ఉమెన్ జాబితాలో నయన్ పేరు కూడా ఉంది.


సంతోషంతో ఇన్‌స్టాలో పోస్ట్..
జోయా అఖ్తర్, సంగీతా రెడ్డి, మాధుబి పూరీ వంటి బిజినెస్ ఉమెన్స్ మధ్య నయన్ పేరు కూడా ఈ జాబితాలో ఉండడంపై తను సంతోషం వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఈ క్రెడిట్ అంతా తన భర్త విఘ్నేష్ శివన్‌కు ఇచ్చేసింది. తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. ‘‘నాకు పెద్ద పెద్ద కలలు కనడం నేర్పినందుకు నా ప్రియమైన భర్తకు థాంక్యూ’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది నయనతార. అయితే పెట్టుబడుల విషయంలో, బిజినెస్‌ల విషయంలో తాను, విఘ్నేష్.. ఇద్దరం కలిసే నిర్ణయాలు తీసుకుంటామని, ఇద్దరూ అప్రూవ్ చేసే వరకు ప్రొడక్ట్ బయటికి వెళ్లదు అని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బయటపెట్టింది లేడీ సూపర్ స్టార్. మొత్తానికి నయన్.. సినీ, వాణిజ్య రంగాల్లోనూ తన సత్తా చాటుతూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది.






Also Read: ఆ మూవీ ఫ్లాప్ తర్వాత అల్లు అర్జున్ ప్రవర్తన చూసి షాకయ్యా - వక్కంతం వంశీ