మంత్రి కేటీఆర్ కు ఓ తల్లి రాసిన లేఖ ఆయన్ను ఎమోషనల్ అయ్యేలా చేసింది. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కు (KBR Park) లో తిరిగే నెమళ్ల ఈకలను పిల్లలు తీసుకునేందుకు అనుమతించాలని అటవీ అధికారులను ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ను ఓ తల్లి సోమవారం లేఖ ద్వారా కోరారు. ఆమె రాసిన లేఖకు కేటీఆర్ స్పందించారు. అటవీశాఖ అధికారులు చిన్న పిల్లల విషయంలో వన్యప్రాణ సంరక్షణ చట్టాలలో నెమలి ఈకలను తీసుకోవడానికి అవకాశం కల్పించాలని అభిప్రాయపడుతూ ట్వీట్ చేశారు.


‘‘నా కుమారుడు 5 ఏళ్ల వేదాంత్‌. అతనికి నెమలి ఈకలంటే చాలా ఇష్టం. మేం కేబీఆర్​ పార్కుకు వచ్చినప్పుడు అక్కడ కింద పడి ఉన్న నెమలి ఈకలను తీసుకోని ఆడుకుంటుండగా, అధికారులు సెక్యురిటీ సిబ్బంది అడ్డుకొని వాటిని లాక్కున్నారు. వాటిని వారు తీసుకెళ్లి స్టోర్‌ రూమ్‌లో పెట్టడం కన్నా కూడా, ఇలాంటి పిల్లలకి ఇస్తే గొప్ప అనుభూతి, సంతోషం పొందుతారు. కాబట్టి, ఇందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నాను’’ అని ఓ మహిళ మంత్రి కేటీఆర్‌ను లేఖ ద్వారా కోరారు.


‘‘ఒక చిన్నారి బాబు తల్లి రాసిన లేఖ నన్ను ఎంతగానో కదిలించింది. వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద నెమలి ఈకలను తీసుకెళ్లడం చట్టరిత్యా నేరం అంటూ అటవీ అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. కేబీఆర్‌ పార్కు అధికారులు పిల్లలకు ఈ విషయంలో కనీస మినహాయింపు ఇవ్వాలి’’ అని మంత్రి కేటీఆర్​ ట్విటర్ ద్వారా కోరారు.






ఇలాగే ఇండిగో విమాన సిబ్బంది వ్యవహార తీరుపైన గత ఆదివారం మంత్రి కేటీఆర్ స్పందించిన సంగతి తెలిసిందే. దయచేసి స్థానిక భాషలను గౌరవించాలని ఇండిగో సంస్థను కోరారు. ఇండిగో విమానంలో ఓ తెలుగు మహిళకు ఎదురైన వివక్షాపూరిత అనుభం దృష్ట్యా మంత్రి ఈ సూచనలు చేశారు. దీనికి సంబంధించి ఇండిగోను ట్యాగ్ చేస్తూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న 6E 7297 ఇండిగో విమానంలో ఓ మహిళ కూడా ఎక్కారు. ఆమెకు తెలుగు మాత్రమే అర్థం చేసుకోగలుగుతున్నారు. హిందీ, ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. దీంతో ఆమెను తన సీటు నుంచి లేపి విమాన సిబ్బంది మరో సీటులో కూర్చోబెట్టారు. 


ఈ విషయాన్ని గుర్తించిన అదే విమానంలో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికురాలు, ఐఐఎం అహ్మదాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవాస్మిత చక్రవర్తి అనే మహిళ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. సెప్టెంబరు 16న ఈ ఘటన జరిగింది. విమానంలోని ఓ ఫోటోను ట్వీట్ చేస్తూ గ్రీన్ కలర్ చీర కట్టుకున్న మహిళ ఒరిజినల్ సీట్ నెంబరు 2A (XL సీట్, exit row). కానీ, ఆమెను అక్కడి నుంచి లేపి 3C లో కూర్చొబెట్టారు. ఎందుకంటే ఆమెకు తెలుగు మాత్రమే వచ్చు. ఇంగ్లీష్, హిందీ రాదు. విమాన సిబ్బందిని అడిగితే అది సెక్యురిటీ ఇష్యూ అని చెప్పారు. అంటూ ఇండిగో విమాన సంస్థను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.