బిజీబిజీ లైఫ్‌లో వ్యాయామానికి కాస్త టైమ్‌ కేటాయించడం తప్పనిసరి. ముఖ్యంగా వాకింగ్‌. నడక వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ప్రతిరోజు వాకింగ్‌కు కొంత సమయం కేటాయించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. వాకింగ్‌ వల్ల శరీరం హుషారుగా ఉంటుంది. రోజూ వాకింగ్‌ చేసిన వారు చురుకుగా ఉంటారు. నగర ప్రజలు వాకింగ్‌ చేసుకునేలా... ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు చేపడుతోంది. 


ఆరోగ్యంగా ఉండాలంటే.. నడక, వ్యాయామమే మంచి మార్గమని అన్నారు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి. హైదరాబాద్‌ మహవీర్​ హరిణ వనస్థలి నేషనల్​ పార్స్‌లో... వాకర్స్ అసోసియేష‌న్ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన 4కే రన్‌ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని మహవీర్ హరిణ వనస్థలి నేషనల్​ పార్క్‌లో వాకర్స్ అసోసియేష‌న్ ఆధ్వర్యంలో నిర్వహించిన 4కే రన్‌ కార్యక్రమంలో... ఎమ్మెల్యే ఎల్బీన‌గ‌ర్ సుధీర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అట‌వీ శాఖ అధికారులు పాల్గొన్నారు.


నడకతోపాటు సహజ పద్ధతుల్లో మెరుగైన ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఉదయాన్నే వాకింగ్‌ చేయడం మంచిదని డాక్టర్లు కూడా సూచిస్తున్నారని అన్నారు ఇంద్రకరణ్‌రెడ్డి. వాకింగ్‌ వల్ల.. అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని చెప్పారు. ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచటంతో పాటు పర్యావరణ పరిరక్షణ, అట‌వీ భూముల సంర‌క్ష‌ణ కోసం ఫారెస్ట్‌ బ్లాకుల్లో అర్బన్‌ లంగ్స్‌ స్పేస్ అంటే అర్బ‌న్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేస్తున్నామ‌న్నారు. ఈ అర్బన్‌ పార్కుల్లో వాక‌ర్స్... ఉదయం, సాయంత్రం వాకింగ్‌ చేస్తున్నారని చెప్పారు. అంతేకాదు ఆహ్లాదం, ఆనందం కోసం వీకెండ్‌లో సంద‌ర్శ‌కులు సేదతీరుతున్నారని అన్నారు. రిజ‌ర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లో ఉన్న కొత్తగూడలోని కోట్ల విజ‌యభాస్కర్‌రెడ్డి బొటానిక‌ల్ గార్డెన్‌ను ఉమ్మడి పాల‌న‌లో వాణిజ్య అవ‌స‌రాల‌కు లీజుకు ఇస్తే దాన్ని అడ్డుకున్న ఘ‌న‌త ఆ ప్రాంత వాకర్స్‌కు ద‌క్కుతుంద‌న్నారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాన్ని ఎకో టూరిజం పార్కుగా అభివృద్ధి చేశామ‌ని చెప్పారు.