క్షేణికావేశంలో చేస్తున్న హత్యలు జీవితాలను నాశనం చేస్తున్నాయి. ప్రేమించిన అమ్మాయి దూరమవుతుందేమోనన్న బాధ... వేరేవారికి దగ్గరవుతుందేమోనన్న  అనుమానం.. దారుణాలను పురిగొల్పుతోంది. హత్యలు చేసేవరకు తీసుకెళ్తోంది. దాని వల్ల.. తర్వాత జీవితాలు తారుమారవుతాయన్న ఆలోచన లేకుండా... క్రూరంగా  ప్రవర్తిస్తున్నారు కొందరు. హత్యలు చేసి... భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. తాను ప్రేమించిన అమ్మాయితో  చనువుగా ఉంటున్నాడన్న కారణంగా... ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ను హత్య చేశాడో యువకుడు. తన స్నేహితులతో కలిసి దారుణంగా హతమార్చాడు. ఈ కేసులో నలుగురు  నిందితులను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో నలుగురు నిందితులు నేరాన్ని అంగీకరించారు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా రాగోలుకు చెందిన 20ఏళ్ల సాయి.. హైదరాబాద్‌లో ఉంటున్నాడు. యూట్యూబ్‌లో వీడియో పోస్ట్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఓ యువతితో పరిచయం అయ్యింది. ఆమె జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లకు సాయి ప్రవర్తన నచ్చక ఆమె దూరం పెట్టింది. ఆ తర్వాత ఆమెకు మహబూబాబాద్‌ జిల్లా సంకిస గ్రామానికి చెందిన 18ఏళ్ల కార్తీక్ దగ్గరయ్యాడు. కార్తీక్‌.. హైదరాబాద్‌లో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చారు. యూసుఫ్‌గూడలోని కార్తీక్‌ సోదరుడు శంకర్‌ ఉంటున్న గదికి వెళ్లి... మూడు రోజులు అక్కడే గడిపారు. ఈ విషయం తెలిసి సాయి తట్టుకోలేకపోయాడు. అందుకే కార్తీక్‌ హత్యకు ప్లాన్‌ చేశారని పోలీసుల విచారణలో తేలింది. 


విజయనగరం జిల్లాకు చెందిన సురేష్, రఘు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన జగదీశ్... సాయి స్నేహితులు. ముగ్గురు స్నేహితుల సాయంతో కార్తీక్‌ హత్యకు ప్లాన్‌ చేశాడు సాయి. గత నెల 13న రెండు బైక్‌లపై కార్తీక్‌ గదికి వెళ్లారు. యువతి దుస్తులు కొన్ని తమ గదిలోనే ఉండిపోయాయని.. వచ్చి తీసుకెళ్లమని చెప్పాడు. నిజమే అని నమ్మిన కార్తీక్‌... వారితో కలిసి బైక్‌పై వెళ్లాడు. ఓల్డ్ బోయిన్‌పల్లి ఎయిర్‌పోర్ట్‌ దగ్గర అటవీప్రాంతం వైపు కార్తీక్‌ను తీసుకెళ్లారు సాయి, అతని ఫ్రెండ్స్‌. అక్కడ కార్తీక్‌పై దాడి చేశారు. చెట్టుకు కట్టేసి కత్తితో పక్కటెముకల్లో పొడిచేశారు. కత్తి వంకర పోవడంతో.. బాధితుడిని కిందపడేసి పీకకోసేశారు. బండరాయితో తల బద్దలుకొట్టారు. చనిపోయాడని నిర్ధరించుకున్నాక సాయి, అతని ముగ్గురు స్నేహితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్తీక్‌ చంపేసిన తర్వాత ముగ్గురు నిందితులు సొంతూళ్లకు వెళ్లిపోగా.. సాయి మాత్రం మృతుడి హైదరాబాద్‌లోనే ఉండిపోయాడు. 


గతనెల 13 నుంచి కార్తీక్‌ కనిపించకపోయే సరికి... అతని సోదరుడు శంకర్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు కంప్లెయింట్‌ ఇచ్చాడు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. సీసీ ఫుటేజీ, ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా.. ఎంక్వైరీ చేసి... సాయి, అతని ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించడంతో.. కార్తీక్‌ హత్య బయటపడింది. నలుగురూ కలిసి కార్తీక్‌ను చంపేసినట్టు విచారణలో అంగీకరించారు. ఈ హత్యలో యువతి ప్రమేయం ఏమైనా ఉందా..? అనే కోణంలోనే పోలీసులు విచారణ జరుపుతున్నారు.