చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపర్చిన సందర్భంగా ఏపీ సీఐడీ కోర్టుకు 28 పేజీలతో రిమాండ్ రిపోర్టును సమర్పించింది. ఇందులో చంద్రబాబుపై కీలక ఆరోపణలు చేసింది. చంద్రబాబును A - 37 గా రిమాండ్ కోర్టులో సీఐడీ పేర్కొంది. నేరపూరిత కుట్ర, నిధుల దుర్వినియోగంపై అభియోగాలు మోపింది. ప్రజా సేవకుడిగా చంద్రబాబు తన స్థానాన్ని దుర్వినియోగం చేశారని సీఐడీ ఆరోపించింది. ప్రజాప్రతినిధిగా ఉండి చంద్రబాబు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సీఐడీ ఆరోపించింది. 2021లో పేర్కొన్న ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు. తాజాగా ఆయన పేరును చేర్చారు. డిజైన్ టెక్, సీమన్స్ ఎండీలతో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ అభియోగాలు చేసింది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరుమీద రిమాండ్‌ ఈ రిపోర్టు సమర్పించారు. సీఐడీ చీఫ్ నిన్న చెప్పిన అంశాలు, ఆరోపణలనే ప్రధానంగా రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారి పేర్కొన్నారు.


తాడేపల్లి కేంద్రంగా అక్రమాలు
2021 డిసెంబర్‌ 9 కంటే ముందు నేరం జరిగిందని సీఐడీ వివరించింది. తాడేపల్లిలోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని వెల్లడించింది. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్ల రూపాయలను చెల్లించారని సీఐడీ వివరించింది. వీటిలో దాదాపు రూ.279 కోట్ల మేర నిధుల దుర్వినియోగమైనట్లుగా సీఐడీ నివేదికలో వెల్లడించింది. దీనివల్ల ఏపీ ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని సీఐడీ రిమాండ్ రిపోర్ట్ లో తెలిపింది. డిజైన్ టెక్ సంస్థ కొన్ని సంస్థలకు నిధులు బదిలీ చేసిన  సమయంలో జీఎస్టీ ఎగవేసిందని రిమాండ్ రిపోర్టులో సీఐడీ పేర్కొంది.


లోకేశ్, అచ్చెన్నాయుడు పేరు కూడా
చంద్రబాబుతో పాటు రిమాండ్‌ రిపోర్టులో నారా లోకేష్‌ పేరును కూడా సీఐడీ ప్రస్తావించింది. చంద్రబాబు సన్నిహితుడు కిలారి రాజేశ్‌ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందాయని పేర్కొంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరును కూడా సీఐడీ చేర్చింది. 


దీని ఆధారంగా దర్యాప్తు చేస్తే అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని సీఐడీ అధికారులు నివేదికలో తెలిపారు. టెక్నాలజీ పార్ట్‌నర్లుగా నామినేషన్ పద్దతిలో ఈ సంస్థలను నియమించారని, వారికి 371 కోట్ల రూపాయలు ప్రభుత్వ వాటా కింద చంద్రబాబు ఆదేశాల మీద చెల్లించారని రిమాండ్ రిపోర్టులో ఆరోపించారు. ఈ విధంగా చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని, తమ స్వార్ధం కోసం ఈ విధంగా చేశారని రిమాండ్ రిపోర్టులో సీఐడీ పేర్కొంది.


సీఐడీ పూర్తి రిమాండ్ నివేదిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


View Pdf