విజయవాడ కోర్టులో చంద్రబాబును సీఐడీ అధికారులు హాజరు పరిచారు. చంద్రబాబు తరఫున సీనియర్ సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపిస్తున్నారు. సీఐడీ తరపున ఏఏజీ పి.సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఇరు పక్షాల వాదనల తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుదన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

 

విజయవాడ ఏసీబీ కోర్టుకు ఏపీ సీఐడీ రిమాండ్ రిపోర్టును సమర్పించింది. 2021 ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోయినప్పటికీ, తాజా ఎఫ్ఐఆర్ రిపోర్టులో చంద్రబాబు పేరు చేర్చి రిమాండ్ రిపోర్టును కోర్టుకు ఇచ్చారు.

 

సిట్ కార్యాలయం నుండి ఏసీబీ కోర్టుకు చంద్రబాబును తెల్లవారుజామున 5 గంటల సమయంలో తీసుకొచ్చారు. అరెస్ట్ చేసిన 24 గంటలలోపు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలనే నిబంధన మేరకు ఆయన్ను కోర్టులో హాజరుపర్చారు. నిన్న (సెప్టెంబరు 9) నంద్యాలలో తెల్లవారుజామున చంద్రబాబును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

 

మొదట తన ఛాంబర్ లో వాదనలు వినిపించాలని న్యాయమూర్తి కోరారు. ఓపెన్ కోర్ట్ లోనే వాదనలు వినాలని న్యాయమూర్తికి టీడీపీ లీగల్ టీమ్ విజ్ఙప్తి చేసింది. దీంతో కోర్ట్ హాల్ లో వాదనలు మొదలయ్యాయి. చంద్రబాబు, ఏపీ సీఐడీ తరపున ఇరు పక్షాల వాదనలు వినిపిస్తుండగా, బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. 

 

ఏసీబీ కోర్టు వద్దకు లోకేశ్‌

చంద్రబాబును ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లడంతో నారా లోకేశ్‌ తమ న్యాయవాదులతో ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. టీడీపీ నేతలు నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, తెనాలి శ్రావణ్‌కుమార్‌లను కూడా కోర్టు దగ్గరకు వస్తుండగా, పోలీసులు అడ్డుకున్నారు.

 

అంతకుముందు ఆదివారం (సెప్టెంబరు 10) తెల్లవారుజాము 4 గంటల సమయంలో భారీ భద్రత మధ్య విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. శనివారం (సెప్టెంబరు 9) సాయంత్రం 5 గంటలకు సిట్‌ కార్యాలయానికి చంద్రబాబును తీసుకురాగా, ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకూ దాదాపు 10 గంటలు సిట్‌ కార్యాలయంలోనే ఉంచి విచారణ చేశారు. సిట్‌ కార్యాలయం నుంచి ఆసుపత్రికి చంద్రబాబును ఉదయం 3.30 గంటలకు తీసుకెళుతుండగా, వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని పక్కకు నెట్టేసి.. ముందుకు సాగారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు బందోబస్తు పెంచారు. సుమారు 4 గంటల సమయంలో ఆయనకు బీపీ, షుగర్, ఎక్స్‌రే, ఛాతీ సంబంధిత పరీక్షలు చేయించారు. దాదాపు గంట పాటు వైద్య పరీక్షలు జరిగాయి.

 

అక్కడి నుంచి మళ్లీ సిట్ ఆఫీసుకు..
దాదాపు గంటపాటు వైద్య పరీక్షలు జరిగాక.. అక్కడి నుంచి చంద్రబాబు ఏసీబీ కోర్టుకు తరలిస్తారని అనుకున్నారు. కానీ, మళ్లీ సిట్‌ కార్యాలయానికి తరలించారు. మళ్లీ ఎందుకు సిట్‌ కార్యాలయానికి తరలిస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. రిమాండ్‌ రిపోర్టు సిద్ధం కాకపోవడంతో మళ్లీ సిట్‌ కార్యాలయానికి తీసుకెళుతున్నట్లు పోలీసులు చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం కీలక డాక్యుమెంట్లపై సంతకాల కోసం మళ్లీ సిట్‌ కార్యాలయానికి తీసుకెళ్తున్నట్లుగా అధికారులు చెప్పారు. దీంతో టీడీపీ నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుడ్ని కోర్టులో హజరుపరచాలని డిమాండ్‌ చేశారు.