సెప్టెంబరు 10 నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి మ్యారేజ్ డే. 42వ పెళ్లి రోజు వేడుకలను...ఆదివారం నిర్వహించుకోవాలని చంద్రబాబు, నారా భువనేశ్వరి అనుకున్నారు. అభిమానులు, కార్యకర్తలు, నారా, నందమూరి కుటుంబ సభ్యులు మధ్య పెళ్లిరోజు వేడుకలు నిర్వహించుకోవాలని చంద్రబాబు, భువనేశ్వరి భావించారు. ఒకరోజు ముందే బాబును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ అరెస్ట్ చేసింది.
వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని...ఆదివారం చంద్రబాబుతో కలిసి అమ్మవారిని దర్శించుకోవాలని భువనేశ్వరి తొలుత భావించారు. చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంతో...భువనేశ్వరి శనివారమే అమ్మవారిని దర్శించుకున్నారు. తన భర్తను కాపాడమని దుర్గమ్మను కోరుకున్నానని...చంద్రబాబు పోరాటానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరుకున్నానని వెల్లడించారు. తనకు వచ్చిన కష్టాన్ని దుర్గమ్మ తల్లికి చెప్పుకున్నానని తెలిపారు.
పెళ్లి రోజు సందర్భంగా...చంద్రబాబు, భువనేశ్వరి ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలకు ప్లాన్ చేసుకున్నారు. చెన్నైలోని గవర్నమెంట్ ఎస్టేట్ కలైవాసర ఆరంగంలో, 1981 సెప్టెంబర్ 10న వీరి వివాహం జరిగింది. 1978లో చంద్రగిరి నుంచి పోటీ చేసిన చంద్రబాబు...ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పెళ్లి సమయానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ, పరిశ్రమలు, పురావస్తు శాఖ మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గురించి తెలుసుకున్న నందమూరి తారక రామారావు...భువనేశ్వరిని ఇచ్చి పెళ్లి చేశారు. 1983 జనవరి 23న లోకేష్ జన్మించారు. ఆదివారంతో వీరికి పెళ్లయి 42 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయ్. నాలుగు దశాబ్దాల వైవాహిక జీవితం, ఎంతో మందికి ఆదర్శం. చంద్రబాబు రాజకీయాల్లో బిజీగా ఉంటే, భువనేశ్వరి హెరిటేజ్ బాధ్యతలు చూసుకుంటున్నారు.
బాబును అరెస్ట్ చేయించి...జగన్ తన పైశాచిక ఆనందం పొందుతున్నారని నెటిజన్లు, టీడీపీ కార్యకర్తలు, నేతలు మండిపడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి...పెళ్లి రోజు, పుట్టిన రోజును జైల్లోనే జరుపుకున్నారని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. అందుకే ఒకరోజు ముందే చంద్రబాబును...అరెస్ట్ చేయడం దారుణమని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.