Pawan Kalyan About AP Cm YS Jagan:
బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరే సమయంలో అధికారులు పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్నారు. గన్నవరంలో అనుమతి లేదని చెప్పడంతో వెనుదిరిగిన పవన్.. రోడ్డు మార్గంలోనైనా ఏపీ చేరాలనుకున్నారు. పోలీసుల కళ్లు కప్పి విజయవాడకు వెళ్లాలనుకుని రోడ్డు మార్గంలో బయలుదేరిన పవన్ కళ్యాణ్ ను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. ఎలాగోలా కష్టపడి ముందుకు వెళ్తున్న పవన్ ను అనుమంచిపల్లి దగ్గర మరోసారి పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఆడిన పవన్ మీడియాతో మాట్లాడారు.
సీఎం జగన్ ఓ క్రిమినల్ అని, అందర్నీ జైలుకు పంపాలనుకుంటాడంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారాహి యాత్ర తదుపరి షెడ్యూల్ కోసం మేము రేపు ఓ కార్యక్రమానికి ప్లాన్ చేసుకున్నామని, అయితే చంద్రబాబు నాయుడుని అరెస్టు చేస్తారని మేమేమీ ముందుగా ఊహించలేదు అని చెప్పారు. తనను ఆపితే పోలీసులకి ఒకటే చెప్పా.. బెయిల్ మీద ఈ ముఖ్యమంత్రి బయట ఉన్నాడు. ఎంత సేపూ ఆ ముఖ్యమంత్రి జైలు గురించి ఆలోచిస్తాడు అని ఎద్దేవా చేశారు.
జగన్ క్రిమినల్ అని. విదేశాలకు వెళ్లాలన్నా కోర్టు అనుమతి తీసుకోవాలి. అలాంటి వాడి చేతిలో అధికారం ఉంది అది మన దురదృష్టం అన్నారు. బెయిల్ మీద బయటకెళ్లే వాడికి ఎంతసేపూ అరెస్టులు చేయాలనే ఆలోచనలే ఉంటాయన్నారు. తను క్రిమినల్ అయితే అందరూ క్రిమినల్స్ అవ్వాలని కోరుకుంటాడు. దాంతోనే అందరికీ సమస్య వచ్చి పడిందన్నారు. తాను చంద్రబాబుని కలుస్తానని ఎలా ఊహిస్తారు. కోర్టు ప్రాంగణంలోకి వెళ్లడానికి ఎవరు అనుమతిస్తారు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రావడానికి రాష్ట్ర ప్రభుత్వం వీసా కావాలి అంటుందేమో?. కారణాలు చెప్పడం లేదు. రాకూడదు అంటున్నారు. రౌడీలు, గూండాలకు అధికారం ఇస్తే ఇలాగే ఉంటుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తనను ఆకాశ మార్గంలో వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, రోడ్డు మార్గంలో ఏపీకి రావాలని భావించినట్లు చెప్పారు. కానీ రోడ్డు మీద వెళ్తున్నా కారును అడ్డుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కానీ దానివల్ల ట్రాఫిక్ అగిపోయింది. చాలా మంది బాధ పడుతున్నారని చెప్పారు. ఆఖరికి నడిచి వెళ్తామన్నా అనుమతి ఇవ్వడం లేదని, గతంలో విశాఖలో కూడా ఇలాగే చేశారు. ఏం చేయాలని ప్రశ్నించారు. గూండాలు, దోపిడి చేసే వారికి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుందని ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందన్నారు.
ఓవైపు జాతీయ స్థాయిలో జీ 20 సమ్మిట్ జరుగుతోంది, దేశానికి చాలా ప్రతిష్టాత్మక సమ్మిట్ అది. దేశానికి జీ20 దేశాల ప్రతినిధులు వస్తున్నప్పుడు ఇలాంటి పని చేయడం ప్రధాన మంత్రి మోదీ స్ఫూర్తికి మచ్చ లాంటిదన్నారు. ప్రధాన మంత్రి చాలా కష్టపడి ప్రతిష్టాత్మక సదస్సును ఢిల్లీలో నిర్వహిస్తే.. అన్ని రాష్ట్రాలు సహకరించాలన్నారు. కానీ దురదృష్టం ఏమిటంటే గూండాలకి అధికారం ఇస్తే జీ 20 తాలూకు విశిష్టత వాళ్లకు ఏం అర్థమవుతుందంటూ ఎద్దేవా చేశారు. జగన్ ఆలోచనలకు పోలీసులు సహకరించారు, తప్పా ప్రయోజనం చేకూరే పనులు ఏమీ చేయలేదన్నారు.