Chandra Babu Arrest: ఐదు పది నిమిషాలు కాదు ఏకంగా రెండు గంటలు నిరీక్షణ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబును తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలవనిచ్చారు. ఉదయం నంద్యాలలో అరెస్టు చేసిన ఆయన్ని రోడ్డు మార్గంలో సాయంత్రానికి విజయవాడ తీసుకొచ్చారు. అక్కడ ఆయన్ని సిఐడీ అధికారులు విచారించారు.
చంద్రబాబును అరెస్టు చేసి విజయవాడ తీసుకొస్తున్నారని తెలుసుకున్న ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణీ, వియ్యంకుడు బాలకృష్ణ సీఐడీ ఆఫీసు వద్దకు వచ్చారు. వారిని లోపలికి అనుమతి ఇచ్చిన అధికారులు గంటల తరబడి వెయిట్ చేయించారు.
రెండు గంటల పాటు ఎదురు చూసిన తర్వాత చంద్రబాబుతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణతో చంద్రబాబు పావు గంట మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని ఫ్యామిలీ మెంబర్స్‌కు చంద్రబాబు సూచించారు. ఎవరూ ఆందోళన పడొద్దని హితవు పలికారు. రాజకీయ కుట్రలను సమర్థంగా ఎదుర్కొంటాని ధర్మం తనవైపే ఉందన్నారు.
చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఉండవల్లిలోని నివాసానికి వెళ్లిపోయారు. రాత్రి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం మళ్లీ కోర్టు వద్దకు వచ్చే అవకాశం ఉంది.
అంతకుముందే సీఐడీ సిట్ కార్యాలయానికి వచ్చిన కుటుంబసభ్యులు చంద్రబాబును కలిసేందుకు గంటల తరబడి ఎదురుచూశారు. భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, వియ్యంకుడు బాలకృష్ణలను నాల్గవ ఫ్లోర్ లో కూర్చోబెట్టారు. 5వ ఫ్లోర్ లో చంద్రబాబును సిట్ అధికారులు ముందుగా తాము ప్రిపేర్ చేసుకున్న ప్రశ్నల్ని సంధించి కొన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. అనంతరం కుటుంబసభ్యులను చంద్రబాబును కలిసేందుకు అనుమతించారు.
మొదటగా భువనేశ్వరి, లోకేష్ మరికొందరు కుటుంబసభ్యులు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి బయలుదేరిన బాలక్రిష్ణ, బ్రాహ్మణి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్నారు. అక్కడి నుంచి సిట్ ఆఫీసుకు చేరుకున్న కొంత సమయానికి చంద్రబాబును కుటుంబసభ్యులు కలిసి కేసు విషయంపై చర్చించారు. విచారణ మధ్యలో తన లాయర్ ను చంద్రబాబును కలిసి కేసు విషయం వివరించినట్లు తెలుస్తోంది.
హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు
చంద్రబాబు అరెస్టుపై ఆయన తరపు లాయర్లు శనివారం రాత్రి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లీగల్ సెల్ న్యాయవాదులు న్యాయమూర్తి ఇంటికి వెళ్లి పిటిషన్ ఇచ్చారు. చంద్రబాబును నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని, మరోవైపు ఆయనను అరెస్టు చేసి చాలా గంటలు గడిచిందని పిటిషన్‌లో లాయర్లు పేర్కొన్నారు. చంద్రబాబు వయసును పరిగణనలోకి తీసుకుని ఆరోగ్యరీత్యా 24 గంటల్లోపు ఆయనను కోర్టులో హాజరు పరచాలని కోరారు. మరోవైపు సిట్ ఆఫీసులో అధికారులు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించి చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ ఆలస్యం కావడంతో చంద్రబాబు వైద్య పరీక్షలకు సైతం జాప్యం జరిగింది. ఈ కారణాలతో చంద్రబాబును మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచేందుకు చాలా ఆలస్యమైంది.