Hyderabad Metro News: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మెట్రో రైలుతో అనుసంధానించే ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ప్రతిపాదిత శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో కారిడార్‌కు సంబంధించి సంస్థ ఉన్నతాధికారులు తాజాగా క్షేత్ర స్థాయి సర్వే నిర్వహించారు. ఇందులో మెట్రో రైలు సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మెట్రో అధికారులు డీవీఎస్‌ రాజు, ఎస్‌కే దాస్‌, చీఫ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ ఆనంద్‌ మోహన్‌, జీఎం బీ.ఎన్‌. రాజేశ్వర్‌, ఎస్‌ఈ వై.సాయప రెడ్డి, ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ సిస్ట్రా ఇంజినీరింగ్‌ నిపుణులతో కలిసి ఎయిర్ పోర్టు మెట్రో కారిడార్‌లో నిర్మించే స్టేషన్ల స్థలాల పరిశీలన చేశారు. ఫ్లై ఓవర్లు ఉన్న చోట చేయాల్సిన మార్పులపై చర్చించారు.


ఈ ప్రాజెక్టులో సుమారు 14 కిలో మీటర్ల మార్గాన్ని ఇంజినీరింగ్‌ అధికారులు, కన్సల్టెంట్‌లతో కలిసి కీలకమైన ప్రాంతాలను పరిశీలించారు. ఎయిర్‌ పోర్ట్‌ మెట్రో కారిడార్‌ నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని ఈ సందర్భంగా మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆ సవాళ్లను అధిగమించి అద్భుతంగా నిర్మిస్తామని ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు. నాగోల్‌ నుంచి ఎల్బీ నగర్‌ ను అనుసంధానించడం సహా అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా ఆర్‌జీఐ ఎయిర్ పోర్టు లోపలి దాకా మెట్రో మార్గం నిర్మించాల్సి ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.  ఈ మార్గంలో స్టేషన్ల ఉండాల్సిన ప్రదేశాలు వివరించారు.


 మూసీనది, ఎల్బీ నగర్‌ జంక్షన్‌, బైరామల్‌ గూడ - సాగర్‌ రింగ్‌ రోడ్డు, చాంద్రాయణ గుట్ట ఇంటర్‌చేంజ్‌ స్టేషన్‌ నిర్మించే చోట ఎదురవుతున్న సవాళ్లను ఎలా విధంగా పరిష్కరించాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఇంజినీరింగ్‌ నిపుణులు దీనిపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. మెట్రో మార్గంలో రోడ్డుపై చాలా చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ లు ఉన్నాయని.. ఇతర భారీ నిర్మాణాలు కూడా ఉన్నాయని.. వాటిని ప్రత్యక్షంగా పరిశీలించి ఇంజినీర్లకు సూచనలు చేసినట్లు ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.


నగరంలోనే తొలి వాకలేటర్ ఇక్కడ
నాగోల్‌ - ఎయిర్‌పోర్టు మార్గంలో కొత్తగా నాగోల్‌ మెట్రో స్టేషన్ వద్దనే ఎల్బీ నగర్‌ వెళ్లే మార్గంలో మరో స్టేషన్ నిర్మించాల్సి ఉంటుంది. ప్రయాణికులు రెండు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించడం కోసం కాన్‌కోర్స్ లెవల్‌లో స్కైవాక్‌ నిర్మిస్తారు. నాగోల్‌ స్టేషన్‌ తర్వాత మూసీ నది మీద ఉన్న బ్రిడ్జికి సమీపంలోనే పెద్ద పెద్ద మంచినీటి పైపులు, అండర్ గ్రౌండ్ హైటెన్షన్‌ పవర్ కేబుళ్లు ఉన్నాయి. అందుకని మెట్రో అలైన్‌మెంట్‌ను మరో 10 మీటర్లు ఎడమ వైపునకు జరపాలని సూచించాం. మూసీ అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రణాళిక వేరేగా ఉంది. కాబట్టి.. మూసీ నదిపై మెట్రో బ్రిడ్జిని పొడవైన స్పాన్‌తో నిర్మించాల్సి ఉంటుంది. ఇక ఎల్బీ నగర్‌ జంక్షన్‌‌కు కుడివైపున కొత్త మెట్రో స్టేషన్ రాబోతుంది. ఈ కొత్త మెట్రో స్టేషన్‌ను ఇప్పటికే ఉన్న కారిడార్‌-1 ఎల్బీ నగర్‌ స్టేషన్‌తో విశాలమైన స్కై వాక్‌ నిర్మిస్తారు. దీనికి వాకలేటర్ అమర్చుతారు. నగరంలో ఇదే తొలి వాకలేటర్. దీనిమీద ప్రయాణికులు నిలబడితే అదే ముందుకు తీసుకెళ్తుంది. 


మెట్రో మార్గం నిర్మించడం కోసం భూసేకరణ చేయాల్సి ఉందని.. కాబట్టి ప్రైవేటు ఆస్తులు అతి తక్కువగా సేకరించేలా జాగ్రత్తగా ప్రణాళిక వేయాలని అధికారులను ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆదేశించారు. మెట్రో రైలు స్టేషన్‌ స్థానానికి సంబంధించి, వాటి పేర్ల ఖరారుకు ట్రాఫిక్‌ పోలీసులు, సాధారణ ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలని సూచించారు.