ఇంకా ఆంధ్రప్రదేశ్‌లోనే హైదరాబాద్ ఉందా. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెబుతోంది. టీఆర్‌ఎస్‌కు పంపిన లెటర్‌లో అలా ఎందుకు రాసింది. ఇప్పుడు ఎందుకు విమర్శల పాలవుతోంది. 


తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్‌ఎస్‌గా మారుస్తూ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కేసీఆర్‌కు లెటర్ రాసింది. అందులో కేంద్రం ఎన్నికల సంఘం చేసిన తప్పిదం ఇప్పుడు విమర్శలకు కారణమవుతోంది. కేసీఆర్‌కు పంపించిన లెటర్‌లో రాసిన అడ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘాన్ని వేలు ఎత్తి చూపించే పరిస్థితి వచ్చింది. లెటర్‌లో టీఆర్‌ఎస్ పార్టీ చిరునామా రాస్తూ హైదరాబాద్‌, తెలంగాణ అని రాయాల్సిన ప్లేస్‌లో ఆంధ్రప్రదేశ్‌ అని రాయడంతో తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. 


ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి హైదరాబాద్‌ తెలంగాణలో ఉందన్న సంగతి మర్చిపోయారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దేశంలోనే అత్యన్నత విభాగాల్లో ఒకటైన ఎన్నికల సంఘం ఇలాంటి తప్పు చేయడమేంటని చాలా మంది తప్పుపడుతున్నారు. సరే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియదు అనుకుంటే... ఈ లెటర్‌ను రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు కూడా పంపించారు. అప్పుడైనా ఆ విషయాన్ని సరిచేయలేకపోయారు. తెలంగాణ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు పంపించడమేంటని అవాక్కు అవుతున్నారు టీఆర్‌ఎస్ నేతలు. అందరికీ సమాచారం కోసం పంపించారు అంటే.. మిగతా రాష్ట్రాలకు కూడా పంపించాలి కదా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. 






కేంద్రంలో ఉన్న అధికారులకు రెండు తెలుగు రాష్ట్రాలపై సరైన అవగాహన లేదని ఈ చర్యలు చూస్తుంటే అర్థమైందని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో జాతీయ స్థాయిలో మారుమోగిందని... చాలా అంశాల్లో ముందు ర్యాంకుల్లో ఉందని అయినప్పటికీ ఎన్నికల సంఘానికి తెలంగాణను ఓ రాష్ట్రంగా ఎందుకు గుర్తించలేదని ప్రశ్నిస్తున్నారు. ఇది తెలియక చేసిన తప్పిదంలా అనిపించడం లేదని కావాలని టార్గెటెడ్‌గా చేసినట్టు ఉందని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.