జీతాల ఆలస్యంతో హైదరాబాద్ గోషామహల్ వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హోంగార్డు రవీందర్ ఆరోగ్యం విషమంగా ఉంది. దీంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ ను జేఏసీ నేతలు పరామర్శించారు. రవీందర్‌కు మద్దతుగా రేపటి నుంచి రాష్ట్రంలో డ్యూటీలు బంద్ చేస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నారు.


తమను పర్మినెంట్‌ చేయాలని తెలంగాణలో హోం గార్డుల ఉద్యమం తీవ్రమవుతోంది. రెండు నెలల నుంచి జీతాలు అందడం లేదంటూ హోంగార్డులు ఆందోళనలు చేస్తున్నారు. నాయకుల చుట్టూ తిరుగుతూ విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇంతలో రవీందర్ అనే హోంగార్డు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తమకు జీతాలు అందడం లేదని, జీవితం తలకిందులు అవుతుందని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్ర గాయాల పాలైన ఆ హోంగార్డు ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. 


ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ పరిస్థితి విషమంగా ఉందన్న విషయం తెలుసుకున్న తోటి హోంగార్డులు ఛలో హైదరాబాద్‌కు పిలుపు ఇచ్చారు. ఉస్మానియా హాస్పిటల్‌కు తరలి రావాలన్న హోంగార్డుల జేఏసీ పిలుపుతో ఒక్కసారిగా పరిస్థితి హీటెక్కింది. ఉస్మానియా హాస్పిటల్ వద్ద భారీ ఎత్తున ఆందోళన చెయ్యాలని హోంగార్డులు నిర్ణయించడం ఆందోళనకు కారణమైంది.


ప్రభుత్వం నుంచి లేని స్పందన


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని గత కొంతకాలంగా హోంగార్డులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఉద్యమం కొనసాగుతూ ఉండగానే రవీందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడంతో ఉద్రిక్తత నెలకొంది. 


ఈనెల 16, 17వ తేదీల్లో పెద్ద ఎత్తున ఆందోళన పిలుపునిచ్చింది హోంగార్డుల జేఏసీ. హోంగార్డులు ఎవరు ఆత్మహత్యలకు పాల్పడ వద్దని నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. డిమాండ్లను పోరాడి సాధించుకోవాలే తప్ప ఇలా ఆత్మహత్యలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని అంటున్నారు. దీని వల్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంటుందని సూచిస్తున్నారు. 


హోంగార్డు ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని కేటీఆర్, హరీష్ రావు, కవితను కలిసి జేఏసీ విజ్ఞప్తి చేసింది. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి తోడు రెండు నెలల నుంచి జీతాలు కూడా రాకపోవడంతో హోంగార్డుల్లో ఆందోళన మొదలైంది.