Telangana: ఆసియాలోనే అతిపెద్ద డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వగా.. పెట్టుబడులు పెట్టేందుకు తబ్రీడ్ సంస్థ సిద్ధమైంది. ప్రపంచ ప్రఖ్యాత శీతలీకరణ కార్యకలాపాల సంస్థ అయిన తబ్రీడ్.. మొత్తం రాష్ట్రంలో రూ.1600 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ ఫార్మా సిటీతో సహా పారిశ్రామిక పార్కులలో తరగతి శీతలీకరణ మౌలిక సదుపాయాలను ఉత్తమంగా అభివృద్ధి చేస్తామని తెలిపింది. ఈ మేరకు తబ్రీడ్ సంస్థ రాష్ట్ర సర్కారుతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సమక్షంలో సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. దుబాయ్ లో మంత్రి కేటీఆర్ తో ఆ సంస్థ సీఈఓ ఖలీద్ అల్ మర్జు, ప్రతినిధి బృందం సమావేశం అయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం పచ్చని భవిష్యత్తుకు బాటలు వేస్తోంది!
తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ హితం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే రాష్ట్రంలో భారీగా కొనసాగుతున్న పారిశ్రామికీకరణ, వేగంగా విస్తరిస్తున్న వ్యాపార వాణిజ్య ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి సస్టైనబుల్ భవిష్యత్తు కోసం ఈ అవగాహన ఒప్పందం ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పారు. ఇలాగే ఈ డిస్ట్రిక్ కూలింగ్ సిస్టమ్ 6,800 గిగా వాట్ల శక్తిని, 41,600 మెగా లీటర్ల నీటిని, 6.2 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను ఆదా చేస్తుంది. ఇలా చేస్తూనే తక్కువ విద్యుత్ శక్తిని ఉపయోగించుకునే కూలింగ్ పరిష్కరాలు, కూల్ రూఫ్ పాలసీ వంటి విధానాల ద్వారా రాష్ట్రం 2047 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని అందుకునే దిశగా ముందుకు పోతుందని మంత్రి కేటీఆర్ వివరించారు.
పెట్టుబడులకు ముందుకొచ్చిన NAFFCO కంపెనీ
అగ్నిమాపక సామాగ్రి తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన యూఏఈ దిగ్గజ సంస్థ NAFFCO కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో 700 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. మంత్రి కే. తారక రామారావు తో జరిగిన సమావేశంలో కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్ (NAFFCO Khalid Al Khatib, CEO) ప్రతినిధి బృందం సమావేశమైంది. తెలంగాణ రాష్ట్రంలో తమ అగ్నిమాపక సామాగ్రిని తయారుచేయునట్లు సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా 700 కోట్లు రూపాయల భారీ పెట్టుబడిని పెడుతున్నట్లు తెలిపింది. తెలంగాణతోపాటు భారతదేశం విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అగ్నిమాపక సామాగ్రి, అగ్నిమాపక సేవల అవసరం రానున్న భవిష్యత్తులో భారీగా పెరుగుతుందని విశ్వాసం తమకుందని Naffco తెలిపింది.