Double Bedroom House in Telangana:


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన పథకాలలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం ఒకటి. అర్హులైన పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. ఈ క్రమంలో నేడు (సెప్టెంబర్ 2న) జీహెచ్ఎంసీ పరిధిలో మొదటి విడతలో 11,700 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభించారు. అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు.


మంత్రి హరీష్ రావు పటాన్ చెరు నియోజకవర్గం, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పేదల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని హరీష్ రావు ప్రారంభించారు. లబ్దిదారులకు ఇంటి పట్టాలు అందించి వారి ముఖాల్లో చిరునవ్వు వచ్చేలా చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మరికొందరు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని, పేదలకు ఇళ్లు కట్టించి మాట నిలబెట్టుకుంటున్న నేత కేసీఆర్ అని పేర్కొన్నారు.


కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్‌పల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. కుత్బుల్లాపూర్‌లోని బహదూర్‌పల్లి, గాజులరామారం & డి-పోచంపల్లి ప్రాంతాలలో రూ.227.79 కోట్లతో 2,664 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారు. వాటిని అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. మొదటి దశలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని 9 స్థానాల్లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన లబ్ధిదారులకు మొత్తం 11,700 2BHK హౌసింగ్ యూనిట్లు కేటాయించింది ప్రభుత్వం. ఒక్కో నియోజకవర్గం నుంచి 500 మంది లబ్ధిదారులను సర్కార్ ఎంపిక చేసింది. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు  దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, మాధవరం కృష్ణారావు, తదితరులు ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.






గ్రేటర్‌ హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ మొదలైంది. ఇందు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా డ్రా నిర్వహించి దాదాపు 12వేల మంది లబ్దిదారులను ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ర్యాండో మైజేషన్ సాఫ్ట్‌వేర్‌ ద్వారా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించారు. మొదటి విడత ఇళ్ల పంపిణీ శనివారం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాలు ఉండగా.. ఒక్కో నియోజకవర్గం నుంచి 500 మంది చొప్పున 12 వేల మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. చాంద్రాయణగుట్ట పరిధిలోని బండ్లగూడలో నిర్మించిన 270 ఇళ్లతో పాటు, బహదూర్‌పురలోని ఫారూక్‌నగర్‌లో నిర్మించిన 770 గృహాలను హోం మంత్రి మహమూద్‌  అలీ చేతుల మీదుగా పంపిణీ చేస్తారు.