హైదరాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. స్థానికుల మధ్య గొడవలు గన్ ఫైరింగ్ కి దారి తీశాయి. ఆస్తి పంపకాల సమస్యలు కాల్పులకు కారణం అని తెలుస్తోంది. తన వద్ద ఉన్న లైసెన్స్ పిస్టల్ తో అడ్వొకేట్ మూర్తుజా గాలిలోకి కాల్పులు జరిపారు. మూర్తుజాని అదుపులోకి తీసుకున్న సౌత్ జోన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత శనివారం మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరఫత్ అనే వ్యక్తి మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. అనంతరం ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించగా, పక్కింటి వారు ఇంటిలోకి వెళ్లకుండా గొడవ చేస్తున్నారు. ‘ఎలా ఇల్లు కొనుగోలు చేశావ్. ఇల్లుకు సంబంధించి కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది అని పక్కింటి అడ్వొకేట్ మూర్తుజా గొడవ చేశారు. నిన్న రాత్రి సమయంలో ఇంట్లోకి వెళ్తున్న ఆరఫత్ పై అడ్వొకేట్ దాడి చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఆరఫత్ ని భయబ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో నిందితుడు కాల్పులకు పాల్పడ్డాడని తెలిపారు.


ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు చెందినవారు రాళ్లు, కర్రలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకుని, ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డ వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గన్ ఫైరింగ్‌లో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని పోలీసులు చెప్పారు.