Hyderabad News: హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ నిండు గర్భిణీకి వైద్య సిబ్బంది శస్త్ర చికిత్స నిర్వహించారు. అయితే ఈ క్రమంలోనే అప్పుడే పుట్టిన శిశువు చనిపోయింది. ఇదే విషయాన్ని వైద్యులు... ఆ యువతి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. బిడ్డ పుట్టక ముందే చనిపోయిందని వెల్లడించారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. శస్త్ర చికిత్సకు ముందు వరకు శిశువు చాలా బాగుందని చెప్పిన మీరే బిడ్డ చనిపోయిందని చెప్పడం వెనుక ఏదో పెద్ద కారణమే ఉందని ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ చేసి పసికందును బయటకు తీస్తుండగా కిందపడి చనిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాధిత బంధువులు, కుటుంబ సభ్యులు అంతా కలిసి నిరసనకు దిగారు. ఆస్పత్రి ఎదుట బైఠాయించి తమకు న్యాయం చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని అన్నారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతి చెందినట్లు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కుటుంబ సభ్యులు, బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసుల ఎదుటే వైద్యులు.. బిడ్డ పుట్టకముందే అంటే కడుపులోని చనిపోయిందని వివరించే ప్రయత్నం చేశారు. కానీ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం వెనక్కి తగ్గలేదు. తమకు న్యాయం చేసే వరకు ఆస్పత్రి నుంచి కదిలేది లేదని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం చేస్తేనే నిజా నిజాలు తెలుస్తాయని అంటున్నారు.
వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరు బాలింతల మృతి
హైదరాబాద్ మలక్ పేట్ ఏరియా హాస్పిటల్ లో దారుణ ఘటన జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు బాలింతలు మృతి చెందారు. డెలివరీ కోసం వచ్చిన ఇద్దరు బాలింతలు మృతి చెందారు. నిర్లక్ష్యంగా డెలివరీ చేయడంతోనే బాలింతలు మృతి చెందారని బంధువుల ఆందోళన చేశారు. బాలింతరాలు సిరివెన్నెలకు డెంగ్యూ ఉన్నా వైద్యులు గుర్తించలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. డెంగ్యూతో బాధపడుతున్నా డెలివరీ చేశారని ఆరోపించారు. ప్లేట్ లెట్స్ పడిపోవడంతో సిరివెన్నెలను హుటా హుటిన గాంధీ ఆసుపత్రికి తరలించామని, చికిత్స పొందుతూ ఆమె చనిపోయిందని తెలిపారు. మరో ఘటనలో శివానీ అనే బాలింత మృతి చెందింది. డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శివానీ చనిపోయిందని బంధువుల ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని బంధువుల డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన వైద్యుల పై చర్యలకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బంధువుల ఆందోళనతో ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
అసలేం జరిగింది?
నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామానికి చెందిన మహేశ్ తన భార్య సిరివెన్నెల (23)తో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. మహేశ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య సిరివెన్నెలను కాన్పు కోసం ఇటీవల మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సిరివెన్నెలకు వైద్యులు ఆపరేషన్ చేయగా, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ తర్వాత సిరివెన్నెల అస్వస్థతకు గురికావడంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సిరివెన్నెల మరణించింది. మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంగానే సిరివెన్నెల చనిపోయిందంటూ బంధువుల ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జగదీశ్, తన భార్య శివాణిని ఈ నెల 9న మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో శివాని మగబడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించగా.. ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివాని మృతిచెందింది.