సికింద్రాబాద్ స్వప్నలోక్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటన చాలా బాధాకరం అన్నారు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గురువారం రాత్రి స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం లో 6 మంది మృతిచెందారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేలా అధికారులను ఆదేశించారు మంత్రి తలసాని. గాంధీ హాస్పిటల్ లో మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ శుక్రవారం రాత్రి పరామర్శించారు.
ఎక్స్ గ్రేషియా ప్రకటన
అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. ఎంతో భవిష్యత్ ఉన్న యువత మృతి చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. స్వప్నలోక్ లో జరిగిన అగ్ని ప్రమాద మృతులకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రభుత్వ ఆర్ధిక సహాయం ప్రకటించారు మంత్రి తలసాని. అగ్నిప్రమాదం నివారణకు సరైన జాగ్రత్తలు పాటించని భవన, గోదాముల నిర్వహకులు, యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదానికి కారణమైన స్వప్నలోక్ కాంప్లెక్స్ ను సీజ్ చేస్తాం అన్నారు.


మంత్రి తలసాని ఇంకా ఏమన్నారంటే..
ఫ్యూనెట్ అనే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారు చనిపోయారని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది. ఫైర్ సర్వీసెస్ అధికారులు, పోలీసులు, ఈవీడీఎం అధికారులు చాలా ప్రయత్నించారని అందరూ గమనించారు. పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినా కొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం నుంచి బయటపడ్డవారు చెప్పిన సమాచారంతో కొందర్ని రక్షించామన్నారు. తన కళ్ల ముందే 6 మంది సేవ్ అయ్యారని తెలిపారు. ఓ అబ్బాయి ఏడుస్తూ సార్ ఆక్సిజన్ కావాలని రిక్వెస్ట్ చేశాడన్నారు. అయితే ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కొందరు ఓ రూములోకి వెళ్లి లాక్ చేసుకున్నారు. కాపాడాలంటే తలుపు బ్రేక్ చేయాలి. దీనికోసం వాళ్లకు సామాగ్రి ఇచ్చి పంపించాం. వాళ్లు తలుపులు అవి బ్రేక్ చేసి నలుగురు యువతులు, ఇద్దరు యువకులను రక్షించి తీసుకొచ్చారు. కానీ అగ్నిప్రమాదంలో పొగ పీల్చడంతో ఊపిరాడక వారు అప్పటికే చనిపోయారని నిర్ధారించినట్లు చెప్పారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ ఓనర్ పై చర్యలు తీసుకుంటామన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించినట్లు చెప్పారు.  వరంగల్, మహబూబాబాద్, నర్సంపేట, ఖమ్మం ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. 


అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి అండ్ టీమ్ మార్నింగ్ ఇక్కడికి వచ్చి పరిశీలించారు. ఇక్కడ వాళ్లు జాగ్రత్తలు తీసుకోలేదని స్పష్టంగా తెలుస్తోందన్నారు. కనుక స్వప్నలోక్ కాంప్లెక్స్ ను సీజ్ చేస్తామని మంత్రి తలసాని స్పష్టం చేశారు. హోం మంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఈ ఘటనపై స్పందించి బాధితుల పక్షాన అండగా ఉంటామన్నారు మంత్రి.


జీహెచ్ఎంసీ కీలక ప్రకటన..  
మరోవైపు ఈ అగ్ని ప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ కీలక ప్రకటన చేసింది. నిబంధనల ప్రకారమే భవన నిర్మాణం ఉందన్నారు. ఫైర్ సెట్ బ్యాక్ కూడా ఉందని ధ్రువీకరించారు జీహెచ్ఎంసీ అధికారులు. అయితే బిల్డింగ్ నాణ్యతపై నివేదిక ఇవ్వాలని జేఎన్‌టీయూను కోరారు. నివేదిక వచ్చేంత వరకు స్వప్నలోక్ కాంప్లెక్ తాత్కాలికంగా మూసివేస్తామని ఓ ప్రకటనలో జీహెచ్ఎంసీ తెలిపింది.