TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ సిట్ దర్యాప్తులో కీలక సమాచారం వెలుగుచూసింది. లీకేజీ కేసులో సూత్రధారి రాజశేఖర్ అని సిట్ అధికారులు తేల్చారు.  పేపర్ లీక్‌ కేసుపై TSPSCకి సిట్ నివేదిక అందించింది. పేపర్ లీక్‌లో కీలక సూత్రదారి రాజశేఖర్ అని సిట్ తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే రాజశేఖర్ TSPSCకి డిప్యుటేషన్‌పై వచ్చినట్లు తెలిపింది. టెక్నికల్ సర్వీస్‌ నుంచి డిప్యూటేషన్‌పై టీఎస్పీఎస్పీకి వచ్చిన రాజశేఖర్... ప్రవీణ్‌తో సంబంధాలు కొనసాగించాడు. పబ్లిక్ కమిషన్ లో  సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాడు రాజశేఖర్. 


 సిట్ నివేదికలో కీలక అంశాలు 


టీఎస్పీఎస్సీ సెక్రటరీ కంప్యూటర్‌ని హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ని దొంగిలించాడు రాజశేఖర్. పాస్‌వర్డ్‌ని తాను ఎక్కడా రాయలేదని టీఎస్పీఎస్సీ ఉద్యోగి శంకర్‌ లక్ష్మి చెబుతున్నారు.  శంకర్‌ లక్ష్మి కంప్యూటర్‌ హ్యాక్‌ చేసి పేపర్లు కాపీ చేశాడు రాజశేఖర్. పెన్‌డ్రైవ్ ద్వారా 5 పరీక్షా పత్రాలను కాపీ చేశాడు. కాపీ చేసిన పెన్‌డ్రైవ్‌ను ప్రవీణ్‌కు ఇచ్చాడు. ప్రవీణ్ ఏఈ పరీక్ష పత్రాన్ని రేణుకకు అమ్మాడు. ఫిబ్రవరి 27నే పేపర్‌ను కాపీ చేశాడు రాజశేఖర్. గ్రూప్‌-1 పరీక్షాపత్రం లీకైనట్లు సిట్ గుర్తించింది. ప్రవీణ్‌కు 103 మార్కులు రావడంపై సిట్ విచారణ చేపట్టింది. సెక్రటరీ దగ్గర పీఏగా చేస్తూ ప్రవీణ్ గ్రూప్‌-1 పరీక్షా పత్రాన్ని కొట్టేసినట్లు నిర్ధారించారు. దాదాపు ఐదు పరీక్షా పత్రాలను పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇందులో రెండు రోజుల్లోనే నాలుగు పేపర్లను రాజశేఖర్ కాపీ చేసుకున్నాడు.


పాస్ వర్డ్ ఎలా బయటకు వచ్చిందనే విషయంపై ఆరా 


ఫిబ్రవరి 27న పేపర్ లను ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో కాపీ చేశాడు రాజశేఖర్. ఇందులో జులైలో జరగాల్సిన జూనియర్‌ లెక్చర్‌ పరీక్ష పేపర్ కూడా ఉందని సిట్‌ దర్యాప్తులో తేలింది. అనంతరం ప్రవీణ్‌ రేణుకకు పేపర్లు ఇచ్చాడు. అయితే పాస్‌వర్డ్‌ ఎలా బయటకు వచ్చిందనే విషయంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రవీణ్‌ పాస్‌వర్డ్‌ను శంకర్‌ లక్ష్మి అనే ఉద్యోగి డైరీ నుంచి కొట్టేశానని సిట్ అధికారులకు చెప్పాడు. అయితే శంకర్ లక్ష్మీ మాత్రం పాస్‌వర్డ్‌ను డైరీలో రాయలేదని అంటున్నారు. శంకర్‌ లక్ష్మీ పాత్రపై సిట్ దర్యాప్తు చేస్తుంది.  


నిందితులకు పోలీస్ కస్టడీ 


టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో 9 మంది నిందితులను పోలీసు కస్టడీకి అనుమతించింది కోర్టు. నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే 6 రోజులు పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న 9 మంది నిందితులను శనివారం ఉదయం 10.30 గంటలకు సిట్‌ అధికారులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు. నిందితులను ప్రశ్నించడంతో  ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి కీలక ఆధారాలు తెలుస్తాయని సిట్‌ అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే టీఎస్పీఎస్సీ నాలుగు పరీక్షలను రద్దు చేసింది.  


గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసినట్లు ప్రకటించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌తోపాటు డీఏవో, ఏఈఈ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను ఈ ఏడాది జూన్ 11న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పేపర్ లీకేజీ కారణంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నివేదిక ఆధారంగా ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించారు. ఇవికాకుండా త్వరలో నిర్వహించనున్న మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.