దీపావళి సందర్భంగా దీపకాంతులు, పటాకుల సంబరాలతో పాటు కొన్ని చోట్ల విషాదాలు మిగిలాయి. ఏటా దీపాల పండుగ రోజున టపాసులు కాల్చే సమయంలో ఆనందాలతో పాటు విషాదాలూ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం కంటి గాయాలతో ఆస్పత్రులకు కొంత మంది క్యూ కడుతూ ఉంటారు. ఈసారి కూడా అలాగే జరిగింది.


దీపావళి సందర్భంగా బాణసంచా కాలుస్తూ కొంత మంది ప్రమాదానికి గురి అయ్యారు. హైదరాబాద్‌లో టపాసులు కాల్చుతూ గాయపడ్డవారు మెహెదీపట్నంలోని సరోజినీ దేవీ కంటి హాస్పిటల్ కి, అఫ్జల్ గంజ్ లోని ఉస్మానియా ఆస్పత్రికి వరుస కట్టారు. ఒక్క సరోజినీ దేవి ఆస్పత్రికి మొత్తం 24 మంది గాయపడిన వారు వచ్చారని.. వారికి తగిన చికిత్స చేసినట్లుగా సరోజినీదేవీ కంటి ఆసుపత్రిలో డాక్టర్ వసంత వెల్లడించారు. వారిలో 17 మంది బాధితులను కంటి ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ గా చేర్చుకున్నట్లుగా చెప్పారు. మరిన్ని కేసులు వచ్చినా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని స్పష్టం డాక్టర్ వసంత తెలిపారు. మొత్తం ఆస్పత్రికి వచ్చిన బాధితుల్లో ఐదుగురికి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అందులో ముగ్గురిని వేరే ఆసుపత్రికి రిఫర్ చేశామని చెప్పారు. గాయపడిన వారిలో పిల్లలే ఎక్కువగా ఉన్నారని తెలిపారు.


తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తంగళ్లపల్లి టెక్స్ టైల్ పార్క్ లోని పౌరసరఫరాల ప్రభుత్వ గిడ్డంగుల సముదాయంలోని ఓ గోడౌన్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. గోదాంలో ఉన్న గన్ని సంచులన్నీ పూర్తిగా దగ్ధం అయ్యాయి. దాదాపు కోటి రూపాయల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేశారు.


స్పెషల్ డ్యూటీలు


దీపావళి పండుగ వేళ ఇలాంటి ప్రమాదాలు ఏటా జరుగుతున్నందున రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం అయింది. టపాసులు పేల్చే సమయంలో ప్రమాదవశాత్తు గాయపడిన వారికి చికిత్స కోసం సరోజిని కంటి ఆస్పత్రి, ఉస్మానియా ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. కంటి గాయాలకు సరోజిని ఆస్పత్రిలో, ఇతర శరీర భాగాలకు గాయాలు లేదా చర్మం కాలిపోతే ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్సకు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం డ్యూటీ డాక్టర్లతో పాటు ఉస్మానియా హాస్పిటల్ లో నలుగురు ప్లాస్టిక్‌ సర్జరీ డాక్టర్లకు స్పెషల్ డ్యూటీలు వేశారు.


ఏపీలోనూ విషాదాలు


అటు ఏపీలోనూ కొన్నిచోట్ల దీపావళి కొందరికి విషాదాన్ని నింపింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పులగుర్తలోనూ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా మారడంతో రామచంద్రాపురం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక రాజమండ్రి ఆవరోడ్డు రైతు నగర్‌లోనూ ఓ ఇంట్లో బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయాడు. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. మచిలీపట్నంలోని నవీన్‌ మిట్టల్‌ కాలనీలో దీపావళి టపాసులు కాలుస్తూ 11 ఏళ్ల బాలుడు వేమూరి లక్ష్మి నరసింహారావు మృతి చెందాడు.