Rains in Telangana AP: నైరుతి రుతుపవనాల కాలం అయిపోయింది. ఇక ఈశాన్య రుతుపవనాల వర్షాలు త్వరలోనే మొదలవుతాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన సిత్రాంగ్ తుఫాను బంగ్లాదేశ్ వైపుగా వెళ్లగా, ఏపీలో ఉన్న తేమని లాగి బంగ్లాదేశ్, ఈశాన్య భారత దేశం ప్రాంతాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయలో ప్రభావం చూపనుంది. సిత్రాంగ్ తుఫాను కారణంగా ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత​పెరుగుతోంది. వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పడుతున్నాయి. సిత్రాంగ్ తుపాను సోమవారం ఒడిశా తీరాన్ని చేరుకుంది. అలాగే ప్రయాణిస్తూ అక్టోబర్ 25న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య సిత్రాంగ్ తుపాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. సాగర్ ద్వీపానికి దక్షిణ - ఆగ్నేయంగా 520 కి.మీ, బంగ్లాదేశ్‌లోని బారిసల్‌కు దక్షిణంగా 670 కి.మీ. దూరంలో, పోర్ట్ బ్లెయిర్‌కు వాయువ్యంగా 760 కి.మీ దూరంలో కేంద్రకృతమై ఉంది. రెండు రోజుల పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.
ఈశాన్య రుతుపవనాల వర్షాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 29 నుంచి పరిస్ధితులు వర్షాలకు అనుకూలంగా మారతాయి. శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం ఏర్పడనుంది, దీని వలన ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ చివర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓవైపు వర్షాలు తగ్గినా, మరోవైపు రాత్రివేళ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఏపీలో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలుండగా, తెలంగాణలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి.


తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
సిత్రాంగ్ తుపాను ప్రభావంతో వర్షాలు అంతగా కురవకపోయినా చలి తీవ్రత రాష్ట్రంలో పెరుగుతోంది. తుపాను ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉదయం పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి వేళ చలి తీవ్రత సైతం అధికం అవుతోంది. హైదరాబాద్ లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 30 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదైంది. ఉత్తర దిశ నుంచి గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 






ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఓవైపు సిత్రాంగ్ తుపాను బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని దాటనుంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఉత్తర కోస్తాంధ్రలో విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో అక్టోబర్ చివరి నుంచి కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. సిత్రాంగ్ తుపాను ముప్పు ఏపీపై లేనప్పటికీ, చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పలుచోట్ల తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఉత్తర బంగాళాఖాతం తీరం నుంచి గంటకు 70 నుంచి 80 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో గాలులు తీవ్రత గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లకు తగ్గనుందని అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్ష సూచన ఉంది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లడం సురక్షితం కాదని హెచ్చరించారు. 






దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. అయితే దీని ప్రభావం ఏపీపై అంతగా లేదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలున్నాయి. రాయలసీమలోనూ వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. సిత్రాంగ్ తుపాను ప్రభావం చాలా తక్కువగా ఉంది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి.