Governor TamiliSai : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ కు మధ్య మరింత గ్యాప్ పెరిగింది. అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులకు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఇంకా ఆమోదం తెలపలేదు. ఆరు చట్టసవరణ బిల్లులతో పాటు మరో రెండు కొత్త బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. యూనివర్సిటీల్లో రిక్రూట్‌మెంట్‌కు కామన్ బోర్డు, మున్సిపాలిటీ చట్ట సవరణ, ఫారెస్ట్ వర్సిటీ, అజామాబాద్‌ పారిశ్రామికవాడ చట్టం బిల్లులు పెండింగ్‌‌లోనే ఉన్నాయి. అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం తన పరిధిలోనిదని గవర్నర్ తమిళి సై అన్నారు. బిల్లులకు ఆమోదం తెలిపే విస్తృత అధికారాలు తనకు ఉన్నాయన్నారు. తన పరిధికి లోబడే నడుచుకుంటున్నానని స్పష్టం చేశారు.  పెండింగ్‌ బిల్లులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.  


రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ 


తాను ఎవరికీ వ్యతిరేకం కాదని గవర్నర్ తమిళిసై అన్నారు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య సత్సంబంధాలు లేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుండడం, కేంద్రం విధానాలపై సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కేంద్రంలో పెద్దలు తెలంగాణకు నిధులు కేటాయించడంలేదని  టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్రం అన్ని విధాలా సహకరిస్తున్నా టీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తు్న్నారని బీజేపీ ఆరోపిస్తుంది. ఇరుపార్టీల మధ్య ధాన్యం కొనుగోళ్లపై మొదలైన వైరం నేటికీ కొనసాగుతోంది.   


రాజ్ భవన్ లో దీపావళి వేడుకలు 


హైదరాబాద్ రాజ్ భవన్ ​లో దీపావళి సంబరాలు నిర్వహించారు. దీపావళి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళి సై పెండింగ్ బిల్లులపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. మీడియాతో మాట్లాడిన తమిళిసై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  గవర్నర్ గా తనకు విస్తృత అధికారులు ఉంటాయని తెలిపారు. పెండింగ్ బిల్లులపై నిర్ణయం తీసుకునే అధికారం తనకు ఉందన్నారు.  తన పరిధికి లోబడి పనిచేస్తాన్నారు. పెండింగ్ ​లో ఉన్న బిల్లులను త్వరలోనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.  తన బాధ్యత తెలుసుకుని నిర్ణయాలు తీసుకుంటానన్నారు. అంతకు ముందు రాజ్ భవన్ ​లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా గవర్నర్ దంపతులను కలిసేందుకు ప్రజలు తరలివచ్చారు. గవర్నర్ దంపతులు వారిని కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ గవర్నర్ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.  కోవిడ్ బూస్టర్ డోస్ తీసుకోని వారు, వెంటనే తీసుకోవాలని గవర్నర్ సూచించారు. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లతో జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 


కొనసాగుతున్న వివాదం 


గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు కొద్దిరోజులుగా ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, గవర్నర్ మధ్య గ్యాప్ ఎక్కువయింది. ఈ క్రమంలో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య మరింత దూరం పెరిగిందన్న వాదన వినిపిస్తోంది. గతంలో నరసింహన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య  మంచిసంబంధాలు ఉండేది. అయితే ఇప్పుడు పూర్తి వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నాయి.  తెలంగాణలో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ వివాదం నడుస్తోంది. ఎమ్మెల్సీ సీటు కేటాయింపు, ప్రోటోకాల్ వివాదం, గవర్నర్ దిల్లీ పర్యటన, మంత్రుల విమర్శలు ఇలా వివాదం కొనసాగుతోంది. ఈ పరిణామాలపై గవర్నర్ తమిళి సై మరోసారి స్పందించారు. ఇటీవల ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సౌమ్యురాలినని, బీజేపీ నేపథ్యం ఉన్నా రాజ్యాంగబద్ధ పదవిలో పార్టీలకు అతీతంగా పనిచేశానని గవర్నర్ అన్నారు. రాజ్ భవన్ బీజేపీ ఆఫీసుగా మారిందన్న టీఆర్ఎస్ ఆరోపణల్లో అర్థంలేదన్నారు.