Hyderabad Crime News: రాష్ట్ర రాజధాని నగరంలో కల్తీ ఐస్ క్రీముల తయారీ దందా రోజురోజుకూ పెరిగిపోతుంది. ఎప్పటికప్పుడు పోలీసుల నకిలీ తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి, నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నా... రోజుకో చోట బయట పడుతూనే ఉన్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా షాపూర్ లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. అనుమతులు తీసుకోకుండా కల్తీ ఐస్ క్రీమ్ తయారీ చేస్తున్న గోడౌన్ పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి... నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. అపరిశుభ్రమైన నీళ్లల్లో వివిధ ప్లేవర్స్ కు సంబంధించిన పానకం పోస్తూ.. నాసిరకమైన ఐస్ క్రీములను తయారు చేస్తున్నారు. డెలీసియస్ ఐస్ క్రీమ్ పేరుతో మార్కెట్ లో విక్రయిస్తూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
ఎర్రగడ్డ, శంకర్ లాల్ నగర్ ప్రాంతానికి చెందిన 43 ఏళ్ల ఫిరోజ్.. గత ఐదు సంవత్సరాల క్రితం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి శాపూర్ నగర్ లోని ప్రభుత్వ స్కూల్ వద్ద ఓ షెడ్డును అద్దెకు తీసుకున్నాడు. అక్కడే "డెలీసియస్ ఐస్ క్రీమ్" తయారీ కేంద్రాన్ని ప్రారంభించాడు. ఇందులో ఐదుగురు కార్మికులు పనిచేస్తున్నారు. ఐస్ క్రీమ్ తయారు చేసి చుట్టుపక్కల ప్రాంతాల్లోని షాప్ లలో అమ్ముతున్నాడు. ఫీరోజ్ సంబందిత శాఖల నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా... ప్రాణాంతకమైన కెమికల్స్ వాడుతూ, కల్తీ రకమైన, నాసి రకమైన అలాగే ఎక్సపైరీ అయిన సామాగ్రి/సరుకులను వాడుతూ ఐస్ క్రీములు తయారు చేస్తున్నాడు. ఈ విషయం గుర్తించిన పలువురు స్థానికులు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం ఇవ్వండతో జీడిమెట్ల పోలీసులతో కలిసి సంయుక్తంగా రంగంలోకి దిగారు. తయారీ కేంద్రంపై దాడి చేశారు. సుమారు 15 లక్షల విలువ చేసే సామాగ్రి, 500 స్టికర్లను సీజ్ చేశారు. నిర్వహకుడు ఫిరోజ్ ను జీడిమెట్ల పోలీసులు అరెష్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిన్న పిల్లలకు చాక్లెట్లు, ఐస్ క్రీములు, లాలీ పప్స్ ఎంతగా ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడాది పిల్లాడి నుంచి పదేళ్ల పిల్లలు వాటిని మరింత ఎక్కువగా తింటుంటారు. ఎక్కడ కనిపించినా కొనేంత వరకు తల్లిదండ్రులను వదిలి పెట్టరు. పిల్లలు బాగా మారాం చేస్తున్నారు కదా అని మనం కూడా పిల్లల కోసం వాటిని కొంటుంటాం. కానీ అలాంటివే మన పిల్లలను ప్రాణాలు కూడా తీస్తాయి. వీటికే ఇలా జరుగుతుందా అనుకుంటున్నారా.. జరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే నకిలీ చాక్లెట్లు, ఐస్ క్రీంలు తయారు చేస్తుంటే కాస్త తక్కువ ధరకు అమ్ముతుంటారు. వాటిలో ప్రమాదకర రసాయనాలను కలిపి పిల్లలకు అనేక అనారోగ్య సమస్యలు రావడానికి కారణం అవుతారు. హా అదెక్కడో జరుగుతుంది లెండి.. తినిపిస్తే ఏం కాదనుకుంటే మీరు పెద్ద తప్పే చేసిన వాళ్లు అవుతారు. ఎందుకంటే తాజాగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వీలయినంత వరకు ఐస్ క్రీములు, చాక్లెట్లను పిల్లలకు ఇవ్వకపోవడమే మంచిది.