నేడు కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు
వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాల లబ్ధిదారులకు నిధులను ఇవాళ సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేస్తారు. జనవరి–మార్చి మధ్య పెళ్లి చేసుకున్న 12,132 మందికి రూ.87.32 కోట్లు నిధులు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 16,668 మంది లబ్ధిచేకూరింది. వీళ్లకు ప్రభుత్వం రూ.125.50 కోట్లు రూపాయలు అందజేసింది. 


సిద్దిపేట, హన్మకొండ జిల్లాల్లో కేటీఆర్ పర్యటన 
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ఇవాళ సిద్దిపేట, హన్మకొండ జిల్లాల్లో పర్యటిస్తారు.  రెండు జిల్లాల్లో దాదాపు 215 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఉదయం పది గంటల నుంచి 2.30 వరకు ఉంటారు. అక్కడ రెండున్నరకు బయల్దేరి హన్మకొండకు వెళ్తారు. 


వైఎస్‌ఆర్‌సీపీపై బీజేపీ ఛార్జ్‌షీట్‌


ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా మరో కార్యక్రమం నేటి నుంచి చేపట్టనుంది. అధికార వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో అక్రమాలు, అవినీతి పెచ్చుమీరిపోయాయని ఆరోపిస్తూ నేటి నుంచి నియోజకవర్గాల వారీగా ఛార్జ్‌షీట్లు వేయనుంది. ప్రతి పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఇవాల్టి నుంచి పదో తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. భూకబ్జాలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, ఇసుక, మట్టి, గ్రానైట్, మద్యం అక్రమ రవాణా అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తామంటున్నారు బీజేపీ లీడర్లు. వీటిపై సాక్ష్యాలతో లోకల్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు చేస్తామన్నారు. 


కౌన్ బనేగా ఎన్సీపీ ప్రెసిడెంట్‌ ?
ఎన్సీపీ అధినేత ఎవరు అనేది నేడు తేలిపోనుంది. పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు శరద్‌పవార్ ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ నివేదిక సమర్పించనుంది. ఉదయం 11 గంటలకు ఈ ప్రక్రియ పూర్తికానుంది. ఈ కమిటీలో సుప్రియా సూలే, అజిత్‌ పవార్, ప్రఫుల్‌ పటేల్, ఛగన్‌ భుజ్‌బల్‌ సభ్యులుగా ఉన్నారు. అజిత్‌ పవార్ లేదా సుప్రియా సూలే పార్టీ పగ్గాలు చేపట్టే ఛాన్స్ ఉందని ఎన్సీపీ నేతలు అంటున్నారు. 


నేడు చంద్రగ్రహణం 
ఇవాళ రాత్రి 8.42 నుంచి 1.04 వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అట్లాంటిక్‌లో మాత్రమే కనిపిస్తుంది. భారత్‌లో కనిపించదు. దీనిపై ప్రభావం భారత్‌పై ‌అసలు ఉండబోదని... వచ్చే వదంతులను నమ్మొద్దని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: బ్రిటానియా, మారికో, పేటీఎం, ఫెడరల్‌ బ్యాంక్‌, భారత్ ఫోర్జ్, అదానీ పవర్‌. వీటిపై మార్కెట్‌ దృష్టి ఉంటుంది.


అదానీ ఎంటర్‌ప్రైజెస్: 2023 మార్చి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ. 722.5 కోట్లకు రెట్టింపుపైగా పెరిగింది. ఆదాయం 26% పెరిగి రూ. 31,346.05 కోట్లకు చేరుకుంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ బోర్డ్ ఒక్కో షేరుకు రూ. 1.20 డివిడెండ్‌ ఆమోదించింది. డిసెంబర్ 1, 2023 నుంచి అమలులోకి వచ్చేలా మరో 5 సంవత్సరాల పాటు కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా గౌతమ్ అదానీని తిరిగి నియమించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.


TVS మోటార్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 49.5% వృద్ధితో రూ. 410.27 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ఆదాయం 19.4% వృద్ధితో రూ. 6,605 కోట్లకు చేరుకుంది.


హీరో మోటోకార్ప్‌: నాలుగో త్రైమాసిక నికర లాభంలో 37% (YoY) జంప్‌తో రూ. 859 కోట్లుగా హీరో మోటోకార్ప్‌ నివేదించింది, స్ట్రీట్ అంచనాలను అధిగమించింది. ఆదాయం 12% వృద్ధితో రూ. 8,307 కోట్లకు చేరుకుంది. ఇది కూడా, అంచనా వేసిన రూ. 8,238 కోట్ల కంటే ఎక్కువ.


బ్రిటానియా: త్రైమాసిక సంఖ్యలను నేడు విడుదల చేయనుంది. బ్రోకరేజ్ షేర్‌ఖాన్ కంపెనీ నికర అమ్మకాలు రూ. 4,103 కోట్లకు 16% సంవత్సరానికి పెరుగుతాయని అంచనా వేస్తుంది. నికర లాభం 27.5% పెరిగి రూ. 482 కోట్లుగా ఉంటుందని అంచనా.


మారికో: కంపెనీ ఈరోజు త్రైమాసిక సంఖ్యలను విడుదల చేయనుంది. ఆదాయ వృద్ధి తగ్గుతుందని భావిస్తున్నారు. అధిక వడ్డీ ఖర్చులు, పన్ను చెల్లింపుల కారణంగా PAT వృద్ధి కూడా మితంగా ఉంటుందని అంచనా.


పేటీఎం: మార్చి త్రైమాసిక సంఖ్యలను నేడు విడుదల చేస్తుంది. యూపీఐ చెల్లింపుల్లో పెరుగుదల కారణంగా నికర చెల్లింపు మార్జిన్‌లలో మెరుగుదలతో మంచి సంఖ్యలను నివేదించవచ్చు.


ఫెడరల్ బ్యాంక్: మార్చి త్రైమాసిక ఆదాయాలను ఈరోజు నివేదించనుంది. అధిక వడ్డీ ఆదాయం, బలమైన కార్యాచరణ పనితీరు నేపథ్యంలో బ్యాంక్ నికర లాభంలో బలమైన రెండంకెల వృద్ధిని నివేదించవచ్చని అంచనా.


కోల్ ఇండియా: 2025-26 నాటికి డైవర్సిఫికేషన్, మైన్ డెవలప్‌మెంట్‌ సహా వివిధ ప్రాజెక్టుల్లో 91,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతుంది.


HDFC బ్యాంక్: దేశవ్యాప్తంగా సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో 675 పైగా శాఖలను ప్రారంభించే అవకాశం ఉందని సీనియర్ బ్యాంక్ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది.


భారత్ ఫోర్జ్: మార్చి త్రైమాసికం, సంవత్సరంతో ముగిసిన ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదించడానికి కంపెనీ బోర్డు ఈరోజు సమావేశం కానుంది.


అదానీ పవర్: మార్చి త్రైమాసికం, సంవత్సరంతో ముగిసిన ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదించడానికి కంపెనీ బోర్డు ఈరోజు సమావేశం కానుంది.


నేడు ఐపీఎల్‌లో వందో మ్యాచ్


ఐపీఎల్‌ 2023లో నేడు మరో ఆసక్తికరమైన పోరు చూడబోతున్నాం. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో రాజస్థాన్ రాయల్స్‌ ఢీ కొట్టబోతోంది. ఇది ఐపీఎల్‌ చరిత్రలో వందో మ్యాచ్‌.