Hyderabad Crime News: షాపింగ్ కోసం రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను లైంగికంగా వేధించాడో రాక్షసుడు. ఆమె తిరగబడే సరికి ఆమెపై కోపం పెంచుకొని దాడి చేయడం ప్రారంభించాడు. ఆమెను వివస్త్రను చేసి మరీ దారుణంగా హింసించాడు. అడ్డుకోబోయిన వారిపై కూడా అతడు దాడికి పాల్పడ్డాడు. అయితే అతడు ఇలా ప్రవర్తిస్తుండగా.. తల్లి పక్కనే ఉండి కుమారుడిని సమర్థించడం స్థానికులను నివ్వెరపోయేలా చేసింది.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ బాలాజీ నగర్ నడిరోడ్డుపై దారుణం చోటు చేసుకుంది. జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ నడిబొడ్డున సుమారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో అందరూ చూస్తుండగా... యువతిపై ఓ కీచకుడు అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. షాపింగ్ కోసం రోడ్డుపై వెళ్తున్న గుర్తు తెలియని మహిళపై పెద్ద మారయ్య అనే వ్యక్తి లైంగికంగా వేధించాడు. అయితే తిరగబడిన ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఇష్టం వచ్చినట్లుగా కొడుతూనే.. ఉన్నాడు. అందరూ చూస్తుండగానే ఆమె బట్టలన్నీ చింపేసి వివిస్త్రను చేశాడు. అడ్డుకునేందుకు వెళ్లిన స్థానికులపై కూడా పెద్ద మారయ్య దాడికి పాల్పడ్డాడు. అయితే పెద్ద మారయ్య ఇంత చేస్తున్నా.. పక్కనే ఉన్న తల్లి అతడినే సమర్థించడం గమనార్హం.
అయితే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. బాధిత మహిళకు రక్షణ కల్పించారు. వేసుకునేందుకు బట్టలు ఇచ్చి సరుక్షితంగా ఇంటికి చేర్చారు. అయితే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు పెద్ద మారయ్యను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలే ప్రేమ పేరుతో బాలికను మోసం చేసిన యువకుడు
హైదరాబాద్ నల్లకుంటకు చెందిన 19 ఏళ్ల సాయి ప్రణీత్ మూడేళ్ల క్రితం నగరానికి చెందిన 8వ తరగతి బాలికను ప్రేమించానంటూ వెంట పడ్డాడు. పదో తరగతి వార్షిక పరీక్షలు రాస్తుండగా.. బలవంతంగా ఎత్తుకెళ్లి యాదగిరి గుట్టలో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత బోరబండ ప్రాంతానికి వచ్చి కొంతకాలం కాపురం చేశారు. అనంతరం సరూర్ నగర్ కు వెళ్లి గదిని అద్దెకు తీసుకున్నారు. గంజాయి, మద్యానికి అలవాటు పడిన యువకుడు బాలికను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. గతేడాది డిసెంబర్ లో బాలికకు బాబు పుట్టాడు. ఇక ఇప్పటి నుంచి మరింత నరకం చూపించడం మొదలుపెట్టాడు.
బోరబండలో బంధువులు ఉండడంతో ఆమె అక్కడకు వెళ్లింది. మరింత కోపం సాయి ప్రణీత్ బాబును తీసుకొని నేలకేసి కొట్టాడు. దీంతో బాబు తలకు తీవ్ర గాయం అయింది. వెంటనే బాలుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆపై సాయి ప్రణీత్ పై బాలిక ఫిర్యాదు చేసేందుకు పలు పోలీస్ స్టేషన్ లకు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. తమ ఏరియా పరిధిలోకి రాదని చెప్పి వెనక్కి పంపారు. విషయం దక్షిణ మండలం డీసీపీ జోయల్ డేవిస్ దృష్టికి రావడంతో బాధితురాలి ఫిర్యాదు తీసుకోవాలని బోరబండ పోలీసులను ఆదేశించారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.