Lift Accidents: ఈ మధ్య లిఫ్టు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఇటీవలే నోయిడాలో లిఫ్ట్ ఫెక్షన్ కారణంగా 73 ఏళ్ల వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం తెలిసినప్పటి నుంచి నగరంలో ఎలివేటర్ల భద్రతపై ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో లిఫ్టు ప్రమాదాలు చాలానే జరిగాయి. జులై 5వ తేదీన ఓ షాపింగ్ మాల్ లిఫ్టులో చాలా గంటలపాటు ఇరుక్కుపోయిన గర్భిణీ స్త్రీతో సహా 12 మందిని సిబ్బంది రక్షించారు. ఏడాది క్రితమే కొంపల్లిలోని ఓ సైట్‌లో పని చేస్తున్న 25 ఏళ్ల టెక్నీషియన్ నుజ్జునుజ్జు కాగా.. అంతకు ముందు గ్రిల్‌లో తల కూరుకుపోయి 10 ఏళ్ల బాలుడు దారుణమైన రీతిలో మృతి చెందాడు. మంత్రులు కూడా లిఫ్టులో ఇరుక్కొని ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి
గత మూడేళ్లలో కనీసం ఒక్కొక్కరూ కనీసం ఐదసార్లు లిఫ్టులో ఇరుక్కుపోయారా..!
సోషల్ ప్లాట్ ఫారమ్ లోకల్ సర్కిల్స్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. హైదరాబాద్‌లో 63 శాతం మంది ప్రజలు గత మూడేళ్లలో కనీసం ఒకటి నుంచి ఐదు సార్లు లిఫ్టులో చిక్కుకున్నట్లు చెప్పుకొచ్చారు. నెలకు కనీసం రెండు సార్లు ఎవరో ఒకరు లిఫ్టులో ఇరుక్కుపోతారని పంజాగుట్టలోని రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ కు చెందిన వ్యక్తి తెలిపారు. అయితే అలాంటి సమస్యలు వస్తే మెట్లు ఎక్కి వెళ్లడమో, లేదా వాచ్ మెన్ రిపేర్ చేయడమో చేస్తున్నారని వివరించారు. కానీ నిర్వహణ గురించి తమకు పెద్దగా తెలియదని చెప్పుకొచ్చారు. ఇది కేవలం తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని.. కానీ శాశ్వత పరిష్కారం చూపిస్తే బాగుంటుందని అన్నారు. అలాగే సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది తమ లిఫ్ట్‌లను తయారీదారులు లేదా థర్డ్ - పార్టీ కాంట్రాక్టర్‌లు నిర్వహిస్తున్నారని, ఇది భద్రతా ప్రమాణాలలో అసమానతలకు దారితీసిందని తెలుస్తోంది.
"గడువు ముగిసిన వెంటనే ఏఎంసీని సంప్రదించాలి"
తెలంగాణ ఎలివేటర్స్ అండ్ ఎస్కలేటర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గులాం మొహియుద్దీన్ ఆదిల్ మాట్లాడుతూ.. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. తయారీదారులతో వారి వార్షిక నిర్వహణ ఒప్పందం (AMC) గడువు ముగిసినప్పుడు వినియోగ దారులు తరచుగా మరచిపోతారని చెప్పారు. అలాగే సమస్య తలెత్తినప్పుడు మాత్రమే వారు సమస్యను నివేదిస్తారని అన్నారు. ఏఎంసీ గడువు ముగిసిన వెంటనే, వారు తమ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. లిఫ్ట్ కోసం ఒక సూచన ప్రమాణాలను మూడేళ్ల క్రితమే ప్రభుత్వానికి సమర్పించినా.. నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన వివరించారు.
లిఫ్టుల్లో సంరక్షణ, భద్రతపై చట్టంలో క్లాజులను పొందుపరిచినప్పటికీ, కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే వాటిని ఆమోదించి అమలు చేస్తున్నాయి. లిఫ్టుల్లో సేఫ్టీ గురించి దేశవ్యాప్తంగా ఏకీకృత విధానమేదీ లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన నియమ నిబంధనలు అమలు అవుతున్నాయి. లిఫ్టుల్లో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే దేశవ్యాప్తంగా ఏకీకృత నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు లోకల్ సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా. భారత్ లో ప్రస్తుతం లిఫ్టుల కోసం సమగ్రమైన, ప్రామాణికమైన స్వచ్ఛంద ప్రమాణాలు లేవని ఆయన చెబుతున్నారు.