ప్రజాగాయకుడు గద్దర భౌతిక కాయాన్ని చివరి సారిగా చూసేందుకు భారీగా సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తరలివస్తున్నారు. ప్రజలు, అభిమానుల కోసం ప్రజాయుద్ధనౌక పార్ధివ దేహాన్ని హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో ఉంచారు. ఆయన్ని కడసారి చూసేందుకు వచ్చిన వారితో ఆ పరిసర ప్రాంతం కిక్కిరిసిపోయింది.
నీ పాట ఎప్పుడూ మాలో ఉత్సాహాన్ని ఉద్యమ కాకంక్షను రగిలిస్తూనే ఉంటుందని అంటున్నారు గద్దరక్ నివాళి అర్పించే ప్రముఖులు, అభిమానులు. ఎల్పీస్టేడియంలో ఉన్న గద్దర్ భౌతిక కాయానికి నివాళి అర్పించిన కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయన పాటలు, మాటలను గుర్తు చేసుకున్నారు. గద్దర లాంటి ఉద్యమకారులు, ప్రజాగాయకుడి మరణం రాష్ట్రానికే చాలా తీరని లోటని బాధని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆశయాలు నెరవేరకుండానే ఆయన కాలం చెందారని బాధపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తనతో చెప్పినట్టు కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తాము ఊహించిన తెలంగాణ ఇంకా సాకారం కాలేదని అన్నారని తెలిపారు. మార్పు కోసం మరో ఉద్యమం రావాలని కోరుకున్న వ్యక్తి ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, జానారెడ్డి, కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, బూర న్సయ్య గౌడ్, గరికపాటి నర్సింహరావు గద్దర్ భౌతిక కాయాన్ని సందర్శించి సంతాపం తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ కూడా గద్దర్ భౌతిక కాయానికి నివాళి అర్పించారు.
నా రూమ్ మీట్: ఎన్వీరమణ
సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీరమణ కూడా ఎల్బీ స్టేడియానికి వచ్చి గద్దర పార్థివ దేహానికి నివాళి అర్పించారు. గద్దర్ తన రూమ్ మెట్ అని గుర్తు చేసుకున్నారు. రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని తనను కోరారని తెలిపారు.
తెలంగాణ మంత్రులు కూడా గద్దర్ పార్ధివ దేహానికి నివాళి అర్పించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, నటుడు మోహన్ బాబు, హాస్యనటుడు అలీ, బండ్ల గణేష్, మంచు మనోజ్, సింగర్ మధు ప్రియ నివాళి అర్పించారు. అన్ని యూనివర్శిటీల నుంచి విద్యార్థులు తరలి వచ్చి అశ్రునివాళి అర్పిస్తున్నారు. గద్దర్ రాసిన పాటలను గుర్తుచేసుకుంటున్నారు.
అభిమానులు, ప్రముఖులు నివాళి అర్పించిన తర్వాత ఎల్పీస్టేడియంలోని గద్దర్ భౌతిక కాయాన్ని అమరవీరుల స్థూపం వద్దకు తీసుకొచ్చి కాసేపు ఉంచుతారు. అనంతరం ఎల్బీ స్టేడియం నుంచి సికింద్రాబాద్ మీదుగా ఆల్వాల్ కు గద్దర్ భౌతికకాయాన్ని తరలించనున్నారు. ఆల్వాల్ లో గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో ప్రజాగాయకుడి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అల్వాల్‌లోని గద్దర్ నివాసం వద్ద కాసేపు భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. అక్కడ అంతిమ లాంఛనాలు పూర్తి చేసి అక్కడి నుంచి శ్మశానవాటికకు తరలిస్తారు. ఈ టైంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి నివాళులు అర్పిస్తారని తెలుస్తోంది.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియు నిర్వహించడాన్ని యాంటీ టెర్రరిజం ఫోరం తప్పుబడుతోంది. ఇలా చేయడం అంటే పోలీసు అమరవీరులను అవమాన పరిచడమే అంటూ ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాడి మరణించిన వారి త్యాగాలకు విలువ ఏముందని ఫోరం కన్వీనర్ రావినూతల శశిధర్ ప్రశ్నించారు.