Hyderabad Crime News: హైదరాబాద్ లో దారుణం జరిగింది. పుట్టిన రోజు వేడుకలకు వెళ్దాం రా అని చెప్పి తన స్నేహితురాలైన మరో బాలికను ఓ ఇంట్లోకి తీసుకెళ్లింది. అదే సమయంలో అక్కడ తన ప్రియుడితోపాటు మరో ఐదుగురు యువకులు కూడా ఉన్నారు. నవ్వు ఇక్కడే ఉండు.. నేను నా బాయ్ ఫ్రెండ్ తో కాసేపు మాట్లాడతానని చెప్పి వారిద్దరూ ఓ గదిలోకి వెళ్లగా... ఒంటరిగా ఉన్న బాలికతో ఐదుగురు యువకులు మాట కలిపారు. మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి ఆమె స్పృహ తప్పాకా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు మత్తు దిగే సరికి తెల్లారి అయిపోవడం, అర్థనగ్నంగా ఉండడంతో.. అసలు విషయాన్ని గుర్తించింది. వెంటనే వెళ్లి తల్లికి చెప్పగా.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే...?
ఈ నెల 4వ తేదీన బాలిక మందుల షాపుకు వెళ్లింది. అక్కడే ఉన్న తన స్నేహితురాలు బర్త్ డే పార్టీకి వెళ్దామని చెప్పి సదరు బాలికను బోయిగూడలోని ఓ ఇంటికి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ ఆమె ప్రియుడితోపాటు మరో ఐదుగురు ఉన్నారు. స్నేహితురాలు, ఆమె బాయ్ ఫ్రెండ్ అదే ఇంట్లో పక్కకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో అక్కడున్న ఐదుగురు యువకులు మాట కలిపారు. ఆపై కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తాగించారు. బాలిక కూల్ డ్రింక్ తాగిన నుంచి అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. వాళ్ల చర్యలను ఎదురిస్తూనే మత్తులోకి జారుకుంది.
ఆమెకు మత్తు దిగి మెళకువ వచ్చి చూస్తే మరునాడు ఉదయం అయింది. లేచి చూసే సరికి అర్ధ నగ్నంగా పడి ఉంది. ఏం జరిగిందో అర్థమైంది. వెంటనే వెళ్లిపోయి జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. బాధితురాలు తన తల్లితో కలిసి ఈ నెల 5వ తేదీన ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి భరోసా సెంటర్ కి పంపించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఆరుగురు యువకులతో పాటు వెంట తీసుకెళ్లిన స్నేహితురాలి పైనా కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలుపుతామని పోలీసులు వెల్లడించారు.
మొన్నటికి మొన్న నల్గొండలో ఇలాంటి ఘటనే..
సంక్రాంతి పండుగ కోసం అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. పండగ అయిపోయాక తిరిగి వెళ్లే క్రమంలో.. గ్రామానికి చెందిన ఓ యువకుడి కారులో ఎక్కింది. అందులో మరో ఇద్దరు యువకులు కూడా ఉన్నారు. బస్సు ఆగే దగ్గర దింపారు. అక్కడే సదరు యువకుడికి బట్టల షాప్ ఉండటంతో ఎండలో ఏం నిల్చుంటావు లోపలికి రా అని చెప్పాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావమై బాలిక చనిపోయింది. భయపడ్డ యువకులు ఆమెను తీసుకొని స్థానిక ఆస్పత్రికి వెళ్లారు. స్పృహ తప్పి పడిపోయిందని చెప్పగా.. ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం తల్లిదండ్రులకు అప్పగించారు.