CP Kothakota Srinivas Reddy: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందని.. కేసులో నిందితుడైన ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఊహాగానాలతో దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారని అన్నారు. రాజకీయ నేతల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. ప్రభాకర్ రావును పట్టుకోవడం లేదనే వార్త అవాస్తవం అని స్పష్టం చేశారు. ప్రభాకర్ దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రాలేదని.. సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. శుక్రవారం (ఏప్రిల్ 26) సీపీ మీడియాతో మాట్లాడారు.
‘‘ప్రభాకర్ రావు ఎక్కడున్నాడో ఇప్పటివరకు తెలియదు. ఈ కేసులో నిందితులంతా చాలా స్మార్ట్ గా, ఇంటలిజెంట్ గా వ్యవహరించారు. మా శక్తి మేరకు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నాం. వ్యక్తిగత జీవితాలకు భంగం కలిగించేలా టాపింగ్ చేశారు. వ్యక్తిగత జీవితాలలోకి ప్రవేశించడం అనేది ఘోరమైన నేరం. నలుగురు పోలీస్ ఆఫీసర్స్ ప్రమేయం ఉందని అరెస్ట్ చేశాము. ఈ కేసులో మరి కొంత మంది పోలీసులను సాక్షులుగా పెట్టాం. సాక్షుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశాం’’ అని వివరించారు.
హైదరాబాద్ లో మొబైల్ స్నాచింగ్
మరోవైపు, నగరంలో మొబైల్ స్నాచింగ్ ముఠాకు సంబంధించిన వివరాలను కూడా సీపీ వివరించారు. ‘‘నడుచుకుంటూ వెళుతున్న వారిని టార్గెట్ గా చేసుకొని మొబైల్ స్నాచింగ్ చేస్తుంది ముఠా. కొన్ని సందర్భాల్లో మాటల్లో పెట్టి మొబైల్ స్నాచింగ్, నగదు చోరీ చేస్తున్నారు. రాత్రి 10 గంటల తరువాత ఈ మొబైల్ స్నాచింగ్ చేస్తున్నట్లు గుర్తించాం. మూడు కమిషనరేట్లలో ఇలా మొబైల్ స్నాచింగ్ చేస్తుంది ముఠా. రోజుకు 3 నుంచి నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఈ మొబైల్ స్నాచింగ్ చేస్తున్న ముఠా ఇంటర్నేషనల్ ముఠాగా గుర్తించాము. 7 కేసులు హైదరాబాద్ లో మొబైల్ స్నాచింగ్ చేసినట్లు గుర్తించాం. బైక్ దొంగతనం కేసు ఎల్బీ నగర్ కేసును ఛేదించాం.
సూడాన్ దేశానికి చెందిన 5 మంది ఇల్లీగల్ గా హైదరాబాద్ లో ఉంటున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ లో దొంగతనం చేసిన మొబైల్స్ ను సూడాన్ కి పంపుతున్నట్లు గుర్తించాం. నిరుద్యోగ యువతకు జీతాలు ఇచ్చి మొబైల్ స్నాచింగ్ కి చేయిస్తున్నారు. ఈ కేసులో 12 నిందితులు హైదరాబాద్ కి చెందిన వారు ఉన్నారు. ఐదుగురు నిందితులు సూడాన్ కి చెందిన వారు ఉన్నారు. చైన్ స్నాచింగ్ చేసిన మొబైల్ ఫోన్స్ అమ్మకాలకు, రిసివింగ్ కి జగదీష్ మార్కెట్ కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారింది. స్నాచింగ్ చేసిన మొబైల్ ఫోన్స్ ను విడివిడి భాగాలను కూడా అమ్ముతున్నారు’’ అని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వివరించారు.