Hyderabad News: ఆగష్టు15న రైతులకు రుణమాఫీ చేసి తీరుతామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజీనామా అంటున్న హరీష్‌రావు స్పీకర్ ఫార్మాట్‌లో రిజైన్ లెటర్ రెడీ చేసుకోమని సవాల్ చేశారు. ప్రజలను మోసం చేయాలనుకునే ప్రతిసారీ హరీష్‌రావుకు అమరవీరు స్థూపం గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు రేవంత్.
ఉదయం నుంచి గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరు స్థూపం వద్ద హరీష్‌రావు చేసిన హడావుడిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఉదయం కాంగ్రెస్ సోషల్ మీడియా సిబ్బందితో సమావేశమైన రేవంత్... బీఆర్‌ఎస్ బీజేపీ నేతలపై విమర్శలు చేశారు. హరీష్‌రావు మోసానికి అరవీరుల స్థూపం ముసుగు మాత్రమే అన్నారు. మోసం చేయాలనుకునే ప్రతిసారీ అక్కడకే వచ్చి ఇలాంటి హడావుడి చేస్తుంటారన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అమరుల స్థూపం వద్దకు వెళ్లారా హరీష్‌రావును రేవంత్ ప్రశ్నించారు. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటున్నారని ఎద్దేవా చేశారు. రాజీనామా లేఖ అలా ఉండదన్నారు. తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారని సెటైర్లు వేశారు.
స్పీకర్ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదని హరీష్‌కు సూచించారు రేవంత్. ఏదో లేఖను తీసుకొచ్చి హరీష్‌రావు తెలివి ప్రదర్శిస్తున్నారన్నారు. హరీష్ తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హరీష్ ఇచ్చిన సవాల్‌పై రేవంత్ ఇంకా ఏమన్నారంటే... "హరీష్ ఇప్పటికీ చెబుతున్నా నీ సవాల్‌ను కచ్చితంగా స్వీకరిస్తున్నాం. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం. నీ రాజీనామా రెడీగా పెట్టుకో. అని అన్నారు.