CM KCR : తమ బిడ్డకు పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల తొమ్మిదేళ్ల కల సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఫలించింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన భూపాలపల్లి మండలం, నందిగామ గ్రామానికి చెందిన సురేశ్ అనిత దంపతులు 2013లో ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు నాటి ఉద్యమ రథసారథి నేటి సీఎం కేసీఆర్ తో నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆడపిల్లకు ఇప్పటిదాకా పేరుపెట్టకుండానే పెంచుకుంటూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, స్థానిక నేత ఎమ్మెల్సీ మధుసూధనాచారి చొరవ తీసుకుని, వారిని ప్రగతి భవన్ కు తీసుకొచ్చారు.
తొమ్మిదేళ్ల కల
ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ దంపతులు, సురేష్ అనిత దంపతులను దీవించి వారి తొమ్మిదేళ్ల ఆడబిడ్డకు మహతి అని నామకరణం చేశారు. తమ ఇంటికి వచ్చిన వారికి స్వయంగా సీఎం దంపతులు బట్టలు పెట్టి సంప్రదాయ పద్దతిలో ఆథిత్యమిచారు. బిడ్డ చదువు కోసం ఆర్థిక సాయాన్నందించారు. తమ తొమ్మిదేండ్ల కల ఫలించడమే కాకుండా, ఊహించని రీతిలో తమను ఆదరించి దీవించిన తీరుకు, సురేష్ కుటుంబం ఆశ్చర్యానికి లోనైంది. సీఎం దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.