Robotic Knee Replacement: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మోకాలి మార్పిడి, తుంటి మార్పిడి శస్త్రచికిత్సల్లో సరికొత్త శకం ఆవిష్కృతమైంది. అత్యాధునిక పరిజ్ఞానంతో, అత్యంత కచ్చితత్వంతో శస్త్రచికిత్సలు చేయగలిగే సరికొత్త రోబోను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.  


రోబోడాక్ అనే వైద్యపరమైన రోబో 1992లోనే రంగప్రవేశం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీటిలో పలు రకాల మార్పులు వచ్చాయి. మెరిల్ కంపెనీకి చెందిన క్యువిస్ అనే పూర్తిస్థాయి ఆటోమేటెడ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్ పూర్తిగా విభిన్నమైనది, అత్యాధునికమైనది. 


మొత్తం రోబోనే చేస్తుంది


ఇప్పటి వరకు ఉన్న రోబోలు కటింగ్ టూల్స్, రోబోటిక్ ఆర్మా వరకు మాత్రమే పని చేసేవి. ఈ సరికొత్త రోబోలు పేషెంటు కు సీటీ స్కాన్ తీసి, బోన్ 3డీ మోడల్ ను రూపొందించి దానిపై ప్లాన్ తయారుచేస్తుంది. కావాలనుకుంటే దాన్ని మనం మార్చుకోవచ్చు లేదా దాన్నే తీసుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియను ప్లానింగ్ స్టేషన్ రోబోకు చూపిస్తుంది. దాన్ని మనం నిర్ధారించగానే రోబోయే సొంతంగా కటింగ్ చేస్తుంది.


అత్యంత ఖచ్చితత్వం


ఇందులో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టం ఉండ టంతో అత్యంత సూక్ష్మస్థాయిలో తేడా ఉన్నా వెంటనే ఆగిపోతుంది. బోన్ మూమెంట్ మానిటరింగ్ కూడా ఉంటుంది. సాధారణంగా సర్జన్లు అయితే 3 మిల్లీమీటర్ల స్థాయిలో ఉండే సమస్యలను గుర్తించలేరు. కానీ ఇది ఒక మిల్లీమీటరు కంటే కూడా తక్కువ స్థాయిలోనూ గుర్తిస్తుంది. చేత్తో సర్జరీ చేస్తే ఎంతోకొంత వైబ్రేషన్లు ఉంటాయి. దానివల్ల స్వల్ప తేడాలు రావచ్చు. దీంట్లో అది ఏమాత్రం ఉండదు. లేబర్ తరహాలో కోత ఉండటంతో సమస్యలు వచ్చే అవకాశం లేదు. 


ఈ రోబో ఆవిష్కరణ కార్యక్రమంలో వైద్యప్రముఖులు, సినీనటులు సుధీర్ బాబు, చాందినీ చౌదరి పాల్గొన్నారు.