Shamshabad News : శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళా ప్రయాణికురాలి దగ్గర 268.4 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. ఈ బంగారం విలువ రూ.13 లక్షలు 73 వేలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి మహిళ ను అరెస్ట్ చేశామని అధికారులు వెల్లడించారు. బంగారాన్ని పేస్ట్ రూపంలోకి మార్చి ఓ టేపులో పెట్టి వీపు వెనుకలో అతికించుకొని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల భారీ బంగారం పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల కస్టమ్స్ అధికారులు తనిఖీలలో విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయ అధికారులకు పక్కా సమాచారంతో వేర్వేరు ఘటనల్లో విదేశాల నుంచి తరలిస్తున్న బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. విదేశాల నుంచి వచ్చిన ఎనిమిది మంది ప్రయాణికులను అనుమానంలో అధికారులు తనిఖీ చేయగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ప్రయాణికుల నుంచి 1.89 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. మరో ఘటనలో దుబాయ్ నుంచి వచ్చిన మహిళ ప్రయాణికురాలి షూలో అక్రమంగా రవాణా చేస్తున్న 514 గ్రాముల బంగారం, అలాగే మరో ప్రయాణికుడి నుంచి 100 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న కేసులో 10 మందిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారం తరలిస్తూ పట్టుబడిన నిందితులపై గతంలో ఏమైనా కేసులున్నాయా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Trains Cancelled: రైలు ప్రయాణికులకు అలర్ట్, ఆ రూట్లలో వెళ్లే రైళ్లు రద్దు!
Also Read : కుట్ర చేసి YSRను హత్య చేశారు! నన్నూ చంపాలని చూస్తున్నారు - షర్మిల సంచలనం, కేసీఆర్‌కు ఛాలెంజ్