మనకు నిత్యం ఉపయోగపడే పత్రాల్లో డ్రైవింగ్ లైసెన్స్ చాలా ముఖ్యమైనది. రేషన్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు మాదిరిగానే డ్రైవింగ్ లైసెన్స్  అత్యంత కీలకం. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారు మాత్రమే వాహనాలను నడిపేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే ఎలాంటి వెహికల్స్ నడపకూడదు. ఒక వేళ నడిపితే నేరంగా పరిగణింపబడుతుంది. జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్ తీసుకోవడం ఉత్తమం.  


గతంలో డ్రైవింగ్ లైసెన్స్ సహా ఇతర RTO సేవలు పొందాలంటే చాలా ఇబ్బంది ఉండేది.రోజుల తరబడి RTO కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది.  ప్రస్తుతం రవాణా సంబంధిత సేవలను పొందేందుకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) కొత్త నోటిఫికేషన్‌ను  విడుదల చేసింది. డ్రైవింగ్ లైసెన్స్, కండక్టర్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, పర్మిట్, యాజమాన్యం బదిలీ మొదలైన 58 సేవలను ఇప్పుడు పూర్తిగా ఆన్‌లైన్‌లో పొందే వెసులుబాటు కలిగిస్తోంది. ప్రజలు ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. పౌర-కేంద్రీకృత సేవలను 18 నుంచి  58కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.   


ఆధార్ ఆధారంగా 58  RTO సేవలు పొందే అవకాశం


58 RTO సేవలు ఆధార్ ప్రమాణీకరణ ఆధారంగా ఆన్‌ లైన్‌లో ఉంటాయి. ప్రజలు స్వచ్ఛంద ప్రాతిపదికన ఆధార్ సాయంతో లెర్నర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ,  డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ,  అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ సమస్య, కండక్టర్ లైసెన్స్‌లో అడ్రస్ మార్పు, మోటారు వాహన యాజమాన్యం బదిలీ  దరఖాస్తు సహా పలు సేవలు ఆన్ లైన ద్వారా పొందే అవకాశం ఉంది.





 ఆధార్ లేకపోతే ఈ సేవలను పొందలేమా?   


రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) తాజాగా  జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఆధార్ నంబర్ లేని వారు..  CMVR 1989 ప్రకారం సంబంధిత అథారిటీకి భౌతికంగా ప్రత్యామ్నాయ డాక్యుమెంట్ ను సమర్పించి RTO సేవలను పొందే అవకాశం ఉంది. ఆధార్ లేకపోవడం మూలంగా జనాలు తమ సమయాన్ని, రవాణా వ్యయాన్ని వృథా చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, ఆన్ లైన్ తో పోల్చితే ఆఫ్ లైన్ సేవలు కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. పని త్వరగా పూర్తయ్యే అవకాశం ఉండదు. అందుకే ఆధార్ ద్వారా త్వరితగతిన పలు సేవలు పొందే అవకాశం ఉంటుంది.


ఇకపై మరిన్ని సేవలు


రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) రవాణా సంబంధిత సేవలను మరింత సులభతరం చేయడానికి అనేక పౌర-కేంద్రీకృత సంస్కరణలను చేపడుతున్నట్లు వెల్లడించింది. వీటిని ఉపయోగించి తక్కువ ఖర్చుతో పాటు విలువైన సమయాన్ని ఆదా చేసుకోవచ్చని తెలిపింది.