Queen Elizabeth Funeral:


భారత ప్రభుత్వం తరపున..


భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు హాజరు కానున్నారు. రాయల్ ఫ్యామిలీ ఆహ్వానం మేరకు ఆమె లండన్‌కు చేరుకున్నారు. రేపు (సెప్టెంబర్19) అంత్యక్రియలు జరగనున్నాయి. భారత్ తరపున ద్రౌపది ముర్ము ఎలిజబెత్ రాణికి నివాళులు అర్పించ నున్నారు. మూడ్రోజుల పాటు ఆమె యూకేలోనే పర్యటిస్తారు. బంకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ ఛార్లెస్-3 ఏర్పాటు చేసిన సమావేశంలోనూ పాల్గొంటారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. "క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. ఇప్పటికే ఆమె లండన్ చేరుకున్నారు. భారత ప్రభుత్వం తరపున ఆమె నివాళి అర్పిస్తారు" అని ట్వీట్ చేసింది. ఎలిజబెత్ రాణి మృతికి సంతాపంగా భారత్‌ ఓ రోజు సంతాపదినం పాటించింది. మరుసటి రోజు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్‌కు వెళ్లారు. భారత్ తరపున సెప్టెంబర్ 12వ తేదీన సంతాపం తెలిపారు. గత వారమే విదేశాంగ శాఖ...ద్రౌపది ముర్ము పర్యటనపై ప్రకటన చేసింది. భారత ప్రభుత్వం తరపున ఆమె లండన్‌ వెళ్తారని వెల్లడించింది. 






అంత్యక్రియలకు భారీ ఖర్చు..


క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో ఈ నెల 19న జరుగుతాయి. దీని కోసం 9 మిలియన్ డాలర్లు (సుమారు రూ.71 కోట్లు) ఖర్చవుతుందని అంచనా. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 (96) ఈ నెల 8న కన్నుమాశారు.  తీవ్ర అనారోగ్యానికి గురై రాణి ఎలిజబెత్ 2 కన్ను మూసినట్లు వైద్యులు నిర్ధరించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, సహా యావత్ ఇంగ్లాండ్ శోకసంద్రంలో మునిగిపోయింది. రాణి ఎలిజబెత్‌ను గత ఏడాది అక్టోబర్‌ నుంచే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నడవడం, నిలబడడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అప్పటినుంచి స్కాట్లాండ్‌లోని బాల్మోరల్‌ క్యాజిల్‌లోనే ఆమె ఉంటున్నారు. చివరికి అనారోగ్యంతోనే కన్నుమూశారు. బ్రిటన్‌కు ఎలిజబెత్ 2 ఏకంగా 70 ఏళ్లపాటు మహారాణిగా వ్యవహరించారు. ఆమె మృతి పట్ల పలువురు దేశాధినేతలు విచారం వ్యక్తం చేశారు. బ్రిటన్‌ రాణి పోరాట యోధురాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బరువెక్కిన హృదయంతో ఆమెకు నివాళులర్పిస్తున్నట్లు ట్విటర్‌లో తెలిపారు. 2015-18లో బ్రిటన్‌ రాణితో జరిగిన సమావేశాలను మోదీ గుర్తు చేసుకున్నారు.


పట్టాభిషేకానికి ఇంకా సమయం..


ఆమె మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. భారత్ ఈ నెల 11వ తారీఖున జాతీయ సంతాప దినంగా పాటించింది.  బ్రిటన్‌ రాజకుటుంబ నిబంధనల ప్రకారం రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు లేదా వారసురాలిగా 
మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్‌ రాజు/రాణిగా మారిపోతారు. కనుక రాణి ఎలిజబెత్‌ 2 వారసుడిగా మొదటి స్థానంలో ఉన్న పెద్ద కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ బ్రిటన్‌ రాజుగా బాధ్యతలు స్వీకరించారు. అయితే పట్టాభిషేకానికి నిర్దేశిత లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. 
ఇందుకు కొన్ని నెలలు లేదా మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.


Also Read: మహారాష్ట్రలో ఆ బేబీ పౌడర్‌పై నిషేధం, ఈ రసాయనాలు ఉంటే చంటి పిల్లలకు వాడకూడదు