కుట్ర చేసి YSRను హత్య చేశారు! నన్నూ చంపాలని చూస్తున్నారు - షర్మిల సంచలనం, కేసీఆర్‌కు ఛాలెంజ్

ABP Desam Updated at: 18 Sep 2022 12:38 PM (IST)

తన తండ్రి వైఎస్ఆర్ ను కుట్ర చేసి చంపారని వైఎస్ షర్మిల అన్నారు. తనను కూడా అలాగే కుట్ర చేసి చంపాలని చూస్తున్నారని అన్నారు.

ప్రెస్ మీట్ లో సంకెళ్లు చూపి సీఎం కేసీఆర్‌కు ఛాలెంజ్ విసురుతున్న వైఎస్ షర్మిల

NEXT PREV

YS Sharmila Comments: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఊహించని రీతిలో ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. తన తండ్రి వైఎస్ఆర్ ను కుట్ర చేసి చంపారని వైఎస్ షర్మిల అన్నారు. తనను కూడా అలాగే కుట్ర చేసి చంపాలని చూస్తున్నారని అన్నారు. ఆ సందర్భంగా ప్రెస్ మీట్‌లో సంకెళ్లు చూపిస్తూ ఆ సంకెళ్లు తనను ఏమీ చేయలేవని అన్నారు. తనకు బేడీలు అంటే భయం లేదని, చేతనైతే తనను అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాలు విసిరారు. తాను బతికి ఉన్నంత కాలం ప్రజల నుంచి తనను వేరు చేయడం ఎవరి తరమూ కాదని అన్నారు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడడం ఆపడం, తన గొంత ఆపడం ఎవరి తరమూ కాదని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం జిల్లాలగడ్డ తండాలో వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.


కావాలంటే మీ పనోళ్లకు (పోలీసులను ఉద్దేశించి) చెప్పి తనను అరెస్టు చేయించుకోవచ్చని షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ 2 వేల కిలో మీటర్లు పాదయాత్ర చేస్తోంది. రోడ్లు మీదనే బతుకుతూ ఉంది. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసి, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని బయటపెడితే నా పైనే కేసులు పెడతారా?’’ అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు.



నాకు బేడీలంటే భయం లేదు. మీకు దమ్ముంటే, చేతనైతే నన్ను అరెస్టు చెయ్యండి. గుర్తు పెట్టుకో కేసీఆర్.. నా పేరు వైఎస్ షర్మిల. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను. పులి బిడ్డను. ఈ బేడీలు నన్ను ఆపుతాయా? రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారు. నన్ను కూడా చంపగలరు. కానీ, నేను బతికున్నంత కాలం ప్రజల నుంచి నన్ను వేరు చేయడం ఎవరి తరమూ కాదు. నా గొంతు నొక్కు నొక్కడం నీ తరం కాదు. నీ పోలీసులు అయిన నీ పనోళ్లను పంపండి. నన్ను అరెస్టు చేయమనండి. నేను ఇక్కడే ఉంటా.. పాదయాత్రలోనే జనం మధ్యలోనే ఉంటా. జనం కోసం పోరాడుతున్నా. ఎవరిని పంపుతావో పంపు.. దమ్ముంటే నన్ను అరెస్టు చెయ్యండి.-



పాదయాత్ర ఆపేందుకు ఎమ్మెల్యేలు కుట్ర చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. మంత్రి నిరంజన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ.. ఆయనది నోరా? మోరినా? అని మండిపడ్డారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడిన మాటలకు తాను మాటలతో ఆపానని, చేతల వరకు వెళ్ళలేదంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.


వివాదం ఇదీ.. 
2021లో నాగర్‌కర్నూల్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రసంగిస్తూ.. షర్మిల మంగళవారం దీక్షలను.. మంగళవారం మరదలు అంటూ కామెంట్ చేశారు. గతంలో దీనిపై స్పందించిన షర్మిల.. చందమామను చూసి కుక్కలు మొరగడం సహజం. కుక్క బుద్ధి ఎక్కడికి పోతుంది? సంస్కారం లేని వాళ్లు మంత్రులుగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తీవ్ర విమర్శలు రావడంతో మంత్రి నిరంజన్ రెడ్డి తన వ్యాఖ్యలపై అప్పట్లోనే వెనక్కితగ్గుతూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.


గత సెప్టెంబరు 10న వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర ద్వారా వనపర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఆ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు. నిరుద్యోగుల కోసం తాను ప్రతి మంగళవారం నాడు నిరాహార దీక్షలు చేస్తుంటే.. నిరంజన్  మంగళవారం మరదలు అని కామెంట్ చేశాడని గుర్తుచేశారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు వదిలి, వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని వైఎస్సార్ టీపీ పోరాడుతోందన్నారు. కానీ మంత్రి అధికార మదంతో మాట్లాడుతున్నారని, ఎవర్రా మరదలు.. సిగ్గుండాలి కదా అంటూ తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మెట్టు దెబ్బలు తింటారు జాగ్రత్త అని హెచ్చరించారు. పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కారహీనుడు అంటూ మంత్రిపై మండిపడ్డారు.

Published at: 18 Sep 2022 11:44 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.