అతివేగంగా కారు నడిపిన వారి నిర్లక్ష్యం రెండు ప్రాణాలను బలితీసుకుంది. ఉదయం ఎప్పటిలాగే మార్నింగ్ వాక్ కు వచ్చిన తల్లీ కూతుర్లు రెప్పపాటు వ్యవధిలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. హైదరాబాద్ లోని బండ్లగూడ సన్ సిటీ దగ్గర హైదర్‌షాకోట్ మెయిన్ రోడ్ పై ఈ ఘటన జరిగింది. మూల మలుపు వద్ద ఓ కారు అతి వేగంగా దూసుకొచ్చి మార్నింగ్ వాక్ చేస్తున్న తల్లీ కూతుర్లపైకి దూసుకొని వెళ్లింది.  వాకింగ్ చేస్తున్న అనురాధ, ఆమె కుమార్తె మమత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళతో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. 


నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు


కార్ నడిపిన వ్యక్తి తో పాటు కార్ ఓనర్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ సెక్షన్ 304 పార్ట్ -2, 337 కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. కార్ నడిపిన వ్యక్తి A1-మహమ్మద్ బద్రుద్దీన్ ఖాదిర్, కార్ మొదటి ఓనర్ A2-రెహమాన్ అని పోలీసులు వెల్లడించారు.


ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలు అయిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రోడ్డు పక్కగా మార్నింగ్ వాక్ చేస్తున్న వారిని ఓవర్ స్పీడుతో కారు వెనక నుంచి వచ్చి ఢీకొంది. చనిపోయిన వారికి అసలు ఏం జరిగిందో తెలుసుకొనే అవకాశం లేకుండా వారు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు వంపు తిరిగి ఉందని, అప్పటికే ఓవర్ స్పీడులో ఉన్న కారు ఆ మలుపు దగ్గర నియంత్రణ కోల్పోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతులంతా బండ్లగూడ లక్ష్మీనగ‌ర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.


పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.  కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.