Telangana MBBS Seats: వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం కొన్ని వేల కొత్త సీట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అరుదైన ఘనత సాధించింది. 2023- 24 అకడమిక్ ఇయర్ నుంచి దేశ వ్యాప్తంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన మెడికల్ సీట్లలో 43 శాతం సీట్లు తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీలవే అయినందుకు చాలా గర్వంగా ఉందన్నారు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు.  


ఈ విద్యా సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో మొత్తం 2118 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. కాగా, ఇందులో ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే 900 ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లు ఉండటం విశేషం. సీఎం కేసీఆర్ నాయకత్వం, విజన్ కు ఇది నిదర్శనం అని మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 20 ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 56కు చేరింది. గతంలో కేవలం 2,850 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 8,340కి చేరింది. రాష్ట్ర ఏర్పాట్లుకు ముందు మెడికల్ కాలేజీలలో 15 శాతం అన్ రిజర్వుడు కోటా కింద 280 సీట్లు కేటాయించేవారు. ఈ సీట్లు ఏపీ, తెలంగాణ విద్యార్థులకు కేటాయించేవారు. తాజాగా కేసీఆర్ ప్రభుత్వం వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కాలేజీలకు సంబంధించి అడ్మిషన్ రూల్స్ సవరించారు. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్, ప్రకరణ 371 డి నిబంధనల్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్ర ఏర్పాటు తరువాత ఏర్పాటైన మెడికల్ కాలేజీలలో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు కేటాయించాల్సి ఉంటుంది. గతంలో 15 శాతం అన్ రిజర్వుడు సీట్లతో ఏపీ విద్యార్థులు సీటు సాధించడంతో తెలంగాణ విద్యార్థులు నష్టపోయేవారు. ఇప్పుడు వాటికి కేసీఆర్ ప్రభుత్వం చెక్ పెట్టింది.






ఇప్పటికే ఎంబీబీఎస్ బి కేటగిరి సీట్లలో 85శాతం సీట్లు రాష్ట్ర  విద్యార్థులకే చెందేలా లోకల్ రిజర్వ్ చేసింది ప్రభుత్వం. దాంతో  తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1300 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 15 శాతం సీట్లు అన్ రిజర్వుడు సైతం తొలగించడంతో అదనంగా 520 సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కనున్నాయి. ఓవరాల్ గా 1820 సీట్లు తాజాగా అందుబాటులోకి రానుండగా, రాష్ట్ర విద్యార్థుల వైద్యవిద్య కల సాకారం అవుతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial