పోలీసు కానిస్టేబుళ్లపై దౌర్జన్యానికి పాల్పడుతూ నీచంగా అవహేళన చేసిన భోలక్ పూర్ ఏఐఎంఐఎం కార్పొరేటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కార్పొరేటర్ గౌస్ ఉద్దీన్‌ ముషీరాబాద్ పోలీసులపై విరుచుకుపడుతూ వారిపై దౌర్జన్యం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియోను చూసిన మంత్రి కేటీఆర్ గౌస్ ఉద్దీన్‌పై ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులను వదిలిపెట్టవద్దని తెలంగాణ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులను అడ్డుకున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. తెలంగాణలో ఇలాంటి వ్యక్తులను సహించవద్దని ఆదేశించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని ఆదేశించారు. 


అలా కేటీఆర్ ట్వీట్ చేసిన కాసేపటికే పోలీసులు కార్పొరేటర్‌ గౌస్ ఉద్దీన్‌ ను అరెస్టు చేశారు. డ్యూటీలో ఉన్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, వారి విధులకు ఆటంకం కలిగించినందుకు గానూ ఆయనపై సెక్షన్‌ 350, 506 కింద కేసులు నమోదు చేశారు. అనంతరం, అతణ్ని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు.


26 ఏళ్ల మహ్మద్ గౌస్ ఉద్దీన్ వ్యాపారం చేస్తుంటారు. ఈయన ఏడో తరగతి చదివారు. ఆ తర్వాత చదువు కొనసాగించలేదు. భార్యతో పాటు భోలక్ పూర్‌లోనే నివాసం ఉంటారు.


మంగళవారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో నైట్ డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్‌కి వచ్చారు. భోలక్ పూర్ ప్రాంతంలో అప్పటికీ తెరిచి ఉన్న కార్పొరేటర్‌కు చెందిన ఓ హోటల్‌ను మూయించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడికి చేరుకున్న మహ్మద్ గౌసీయుద్దీన్ కానిస్టేబుళ్లపై విరుచుకుపడ్డారు. ఎస్సైని పిలవాలని మీరంతా వంద రూపాయల మనుషులని ఎగతాళి చేస్తూ మాట్లాడారు.


దీంతో ఓ వ్యక్తి ఆ వీడియోను ట్వీట్ చేస్తూ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. ‘‘ఇలాంటి బిహేవియర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. పోలీసులు ఎప్పుడు మర్యాద కోరుకుంటారు. ఇలాంటి ప్రవర్తన ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేదనిది’’ అంటూ కేటీఆర్‌ను, తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.


దానిపై స్పందించిన మంత్రి.. పోలీసులపై దౌర్జన్యం ప్రదర్శించిన బోలక్ ఎంఐఎం కార్పొరేటర్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించేవారు ఎవరైనా సరే.. ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఉపేక్షించవద్దని డీజీపీకి సూచించారు.