Hyderabad News: ఆమె వయసు ప్రస్తుతం 70 ఏళ్లు. ఆమెకు చిన్నప్పటి నుంచి చదువు లేదు. అలాగే ఆమె ఎప్పుడూ అమెరికాకు వెళ్లలేదు. ఆమెకు తెలిసిన స్నేహితులు కానీ బంధువులు కానీ, చుట్టపక్కల వాళ్లు ఎవరూ అమెరికా వెళ్లింది లేదు. అసలు అమెరికాతో సంబంధం ఉన్న వాళ్లతో ఆమెకు సంబంధమే లేదు. కానీ ఆమె గత కొంత కాలం నుంచి అచ్చమైన తెలుగు భాషనే అమెరికా యాసలో మాట్లాడుతోంది.


ఇది వినడానికి వింతగా ఉన్న నిజం. ఈ విషయం విన్న చాలా మందికి ఆమెకు ఏమైనా అమెరికా దెయ్యం పట్టిందా, అందుకే అలా మాట్లాడిందా అనే అనుమానాలు వచ్చాయి. కానీ అవేవీ జరగలేదు. మరేం జరిగింది, అసలు ఆమెకు అమెరికా యాస ఎలా తెలిసింది, ఆమె ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతుంది అంటే. 


హైదరాబాద్ లో ఉంటున్న ఈ 70 ఏళ్ల వృద్ధురాలు ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్ (ఎఫ్ఏఎస్) బారిన పడినట్లు వైద్యులు చెబుతున్నారు. మెదడులో మాట్లాడే ప్రాంతంలో స్ట్రోక్ రావడం కారణంగానే ఆమె ఈ వ్యాధి బారిన పడినట్లు తెలిపారు. అయితే ఇది చాలా అరుదైన వ్యాధి అని హైదరాబాద్ లోని సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు.


దాదాపు ఏడాది క్రితం ఓ వ్యక్తి... తన తల్లి ఉదయం లేచినప్పటి నుంచి తెలుగు భాషను అమెరికా యాసలో మాట్లాడుతుందంటూ తన దగ్గరకు తీసుకొచ్చాడని ట్వీట్ ద్వారా తెలిపారు. వృద్ధురాలు ఎప్పుడూ అమెరికా వెళ్లలేదని, ఆమెకు అమెరికా భాష, యాస గురించి ఏమాత్రం తెలియదని, కనీసం అమెరికాలో తమ బంధువులు, స్నేహితులు కూడా లేరని చెప్పినట్లు డాక్టర్ సుధీర్ కుమార్ పేర్కొన్నారు.






యాసలో ఆకస్మిక మార్పు అనేది నాడీ సంబంధిత సమస్య కావొచ్చని లేదా మెదడులో మాట్లాడే ప్రాంతం దెబ్బతినడం వల్ల కూడా ఇలాంటి అరుదైన వ్యాధి సోకే అవకాశం ఉందని తెలిపారు. దీన్ని గుర్తించడానికి ఎమ్ఆర్ఐ చాలా బాగా ఉపయోగపడుతుందని వివరించారు. అలాగే చాలా సందర్భాల్లో దీన్ని నయం చేయడానికి వైద్య సంరక్షణ సరిపోతుందని చెప్పారు. కాకపోతే మారిన యాస ఎక్కువ రోజులు ఉంటుందని వివరించారు.   


కరోనా కారణంగా చాలా రోజులు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండడం వల్ల ఒత్తిడికి గురయ్యే తన తల్లికి ఈ అరుదైన వ్యాధి సోకిందని ఆమె కుమారుడు భావించారు. ఈ క్రమంలోనే ఓ మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. అయితే ఈ వ్యాధిని గుర్తించలేకపోయారు. ఆయన సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ను కేసును రిఫర్ చేశారు. వెంటనే సదరు వ్యక్తి తల్లిని తీసుకొని అక్కడికి వెళ్లగా.. ఎమ్ఆర్ఏ చేసి సమస్యను గుర్తించారు.


బ్రెయిన్ ఎడమ వైపు అంటే స్పీచ్ ఏరియాలో చిన్న సమస్య కారణంగా వృద్ధురాలు ఈ వ్యాధి బారిన పడ్డట్టు తెలిపారు. చాలా రోజుల పాటు చికిత్సను అందించారు. స్పీచ్ థెరఫీని కూడా అందించడంతో ఆమె ఆరు నెలల్లోనే అమెరికా యాసను మర్చిపోయి అచ్చమైన తెలుగులో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎఫ్ఏఎస్ అనేది ఒక అసాధారమైన అనారోగ్యం అని, ఇది మానసిక, సామాజిక కారణాలతోపాటు తలకు గాయం అయినప్పుడు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని డాక్టర్ సుధీర్ తెలిపారు.