Hyderabad Weather: హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ జనజీవనం నిలిచిపోయింది. ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా వాన దంచి కొడుతోంది. రోడ్లన్నీ నదులు మాదిరిగా మారాయి. కనుచూపు మేర ఎక్కడ చూసిన నీళ్లే కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కొన్ని ప్రైవేటు స్కూల్స్ సెలవులు ఇవ్వకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్‌కు వచ్చి వెళ్లేటప్పుడు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యతను ప్రశ్నిస్తున్నారు. 


రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు నగరం ఆగమాగమైంది. అందుకే ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని అధికారులు కూడా సూచిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యాసంస్థలు నడిపితే ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. 


రాత్రి కురిసిన భారీ వర్షానికి అంబర్‌పేట్‌ నియోజకవర్గంలోని  పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిన కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మురుగు కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అంబర్‌పేట్ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్లే ముసరాంబాగ్ బ్రిడ్జ్‌ వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో దీంతో నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. 


వరద ఉద్ధృతికి చాలా ప్రాంతాల్ వహానాలు  కొట్టుకుపోయాయి. ముషీరాబాద్ లోని రామ్‌నగర్, పార్సిగుట్ట, బౌద్ధ నగర్, గంగపుత్ర కాలనీలు నీటమునిగాయి. భారీ వర్షం కారణంగా కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. వాహనాలు ఆపే ప్రయత్నంలో ఓ వ్యక్తి నీటిలో కొట్టుకుపోయి ఎక్కడో తేలాడు. పాతబస్తీలో ఓ వ్యక్తి టూవీలర్‌పై వెళ్తూ వరద నీటిలో కొట్టుకుపోయాడు. ఇద్దరు సాయం చేసినప్పటికీ ఆయన్ని పట్టుకోలేకపోయారు.