హైదరాబాద్ గౌలిదొడ్డిలోని ఓ గవర్నమెంట్ స్కూలును కేసీఆర్ మనవడు, హిమన్షు రావు దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. కేశవ నగర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను తాను తొలిసారి చూసినప్పుడు తన కళ్ల నుంచి నీళ్లు వచ్చాయని అన్నారు. అందుకే తాను స్కూలు బాగు చేయించడం కోసం నిధుల సమీకరణ చేసి భవనాన్ని మాడ్రనైజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ ఆధునికీకరణ పనుల తర్వాత మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హిమాన్షు రావు బుధవారం (జూలై 12) ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు.
అప్పుడు విద్యార్థినులకు సరైన బాత్ రూమ్‌లు లేవని.. స్కూల్లో మెట్లు సరిగా లేవని అన్నారు. అలాంటి పరిస్థితులను తానెప్పుడూ చూడలేదని చెప్పారు. గత సంవత్సరం నుంచి అప్పుడప్పుడు వచ్చి పనులు ఎలా జరుగుతున్నాయో చూసేవాడినని అన్నారు. ‘‘నేను కేసీఆర్ మనవడిని కదా.. నాకు ఏదైనా మామూలుగా చేసే అలవాటు లేదు. మా తాతలాగా గొప్పగా చేయాలన్నదే ఆలోచన. మా స్కూల్ ప్రొగ్రాంలో భాగంగా ఈ స్కూల్‌కి గోడలు కట్టించాలి అన్నారు. మొదటిసారి ఇక్కడికి వచ్చినపుడు నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. విద్యార్థినులకు సరిగ్గా బాత్ రూమ్‌లు కూడా లేవు.. మెట్లు కూడా సరిగా లేవు. అలాంటి పరిస్థితులు నేను ఎప్పుడూ చూడలేదు’’ అని అన్నారు.
కేవలం స్కూలుకు గోడలు కట్టించడమే కాకుండా, ఇంకా మెరుగ్గా పని చేయాలని అనుకున్నామని చెప్పారు. నిధుల కోసం రెండు పెద్ద ఈవెంట్స్ చేశామని వాటి ద్వారా 40 లక్షలు కూడగట్టగలిగామని చెప్పారు. ఆ తర్వాత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మధుసూదన్ అనే వ్యాపారవేత్త సాయం చేశారని చెప్పారు. వారి సహకారంతోనే ఈ రోజు ఈ స్కూల్‌కి నావంతు సహాయం చేశాను. మా నాన్న కూడా నా చదువులో కాస్త గ్రేడ్ తగ్గినా సరే, పది మందికి మంచి చేసే అవకాశం వస్తే చేయాలని ప్రోత్సహించేవారు. నా ఫ్యామిలీ, ఈవెంట్ నిర్వహించడంలో సాయం చేసిన నా స్నేహితుల వల్లే ఇదంతా సాధ్యం అయింది’’ అని హిమాన్షు రావు మాట్లాడారు.