Telangana Rains: రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం పంటకు సంబంధించి చాలా మంది పంటలు వేసేందుకు వెనకాముందు అవుతున్నారు. కొందరు ఇప్పటికే మొక్కజొన్న, పత్తి వేయగా.. మొక్కలు మొలవడం లేదు. ఈ పంటలకు ఇదే నెల అత్యంత కీలకం కావడం, 60 శాతానికి పైగా మండలాల్లో వర్షాలు లేక సాగుపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ ఏడాది రుతుపవనాల రాకే ఆలస్యమైంది. తర్వాత కూడా అడపాదడపా కొద్దిపాటి వర్షాలు మాత్రమే కురిశాయి. ఆ తర్వాత నుంచి వానలు లేవు. దీంతో ఆరుతడి పంటలు సాగు చేసే రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఒకటికి రెండు సార్లు విత్తనాలు వేసినా అవి మొలకెత్తకపోవడంతో నష్టపోతున్నారు. అధిక విస్తీర్ణంలో పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు సాగు చేసిన రైతులు రోజూ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే రానున్న వారం పది రోజులు రైతులకు అత్యంత కీలకం కాబోతున్నాయి. 


376 మండలాల్లో వర్షపాతం, 39 మండలాల్లో అతితీవ్రం


తెలంగాణలో 23 జిల్లాల్లో కురవాల్సిన వానకంటే తక్కువగా కురవగా.. పది జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు అయింది. ఆ పది జిల్లాల్లోనూ కొన్ని మండలాల్లో వర్షపాతం లోటు ఎక్కువగా ఉంది. మొత్తం 612 మండలాలకు గాను.. 376 మండలాల్లో వర్షపాతం నమోదు అయింది. ఇందులో 39 మండలాల్లో లోటు అతి తీవ్రంగా ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. కురవాల్సిన వర్షం కంటే 20 నుంచి 59 శాతం వరకు తక్కువ పడితే లోటు గాను 60 నుంచి 99 శాతం వరకు తక్కువ కురిస్తే తీవ్రమైన లోటుగా పరిగణిస్తారు. జూన్ 1 నుంచి జులై 11వ తేదీ వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 197.5 మి.మీ కాగా, 150.4 మి.మీ కురిసింది. దీని ప్రకారం చూస్తే రాష్ట్రం మొత్తం మీద లోటు 24 శాతం మాత్రమే. కానీ మండలాల వారీగా చూసినప్పుడు 60 శాతానికి పైగా మండలాల్లో లోటు, ఎక్కువ లోటు ఉండడం ఆందోళన కల్గిస్తోంది. 


అత్యధిక శాతం మండలాల్లో వర్షాభావ పరిస్థితులు


రాష్ట్రంలో వార్షిక సాధారణ వర్షపాతం 919 మి.మీ కాగా.. వానా కాలంలోనే 738.6 మి.మీ కురవాల్సి ఉంది. కీలకమైన జులైలో సాధారణ వర్షపాతం 229.1 మి.మీ కాగా ఇప్పటి వరకు 77.8 మి.మీ పడింది. వాస్తవానికి 11వ తేదీ వరకు కురవాల్సింది 68.1 మి.మీ మాత్రమే. ఇలా చూసినప్పుడు 14 శాతం అధికంగా కురిసినట్లే. జిల్లాలు మండలాల వారీగా చూసినప్పుడు అత్యధిక శాతం మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది జులైలో 11వ తేదీ నాటికి 245.1 మి.మీ వర్షపాతం నమోదు అయింది. దీంతో పోలిస్తే ఈ ఏడాది 68 శాతం తక్కువ వర్షం కురిసింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ నివేదిక ప్రకారం ఎక్కువ జిల్లాల్లో లోటు 20 నుంచి 30 శాతం మాత్రమే ఉంది. కానీ ఈ జిల్లాల్లో మండలాల వారీగా పరిశీలించినప్పుడు తీవ్రత అధికంగా ఉంది. 


ఎక్కువగా ఖమ్మం జిల్లాలో వర్షపాతం లోటు


అలాగే కొత్తగూడెం జిల్లాలో 31 శాతం లోటు వర్షపాతం నమోదు అయింది. కానీ ఆ జిల్లాలోని పినపాక, కరకగూడెం, మణుగూరు, చర్ల, గుండాల మండలాల్లో 55 నుంచి 64 శాతం వరకు వర్షపాతం లోటు నమోదు అయింది. మహబూబాబాద్ జిల్లాలో 37 శాతం లోటు ఉంది. కానీ కొత్తగూడ, గూడూరు, బయ్యారం, ఇంగుర్తి, నరసింహులుపేట, కురవి మండలాల్లో 60 శాతం వరకు లోటు ఉంది. నిర్మల్ జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. బాసర మండలంలో 64 శాతం లోటు ఉంది. జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, మహబూబ్ నగర్ ఇలా పలు జిల్లాల్లో ఎక్కువ మండలాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి . అత్యధికంగా ఖమ్మం జిల్లాలో ఎక్కువ లోటు ఉండడంతో పాటు అత్యధిక మండలాల్లో 50 నుంచి 80 శాతం వరకు లోటు ఉంది. కొన్ని జిల్లాల్లోని పలు మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయింది. వికారాబాద్ జిల్లాలో 6 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ నమోదు అయింది. నారాయణ పేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో కొన్ని మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు..