Heavy Rain in Hyderabad: హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం కురిసింది. ఉదయం ఎండ కారణంగా ఉక్కపోతతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారింది. సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై.. కుండపోత వాన కురిసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం ఇంకా దంచికొడుతుంది. ఆకాశం నుంచి మేఘం విరిగిపడిందా అన్నట్టుగా వాన కురుస్తుండటంతో.. నగరంలోని రోడ్లన్నీ ఒక్క సారిగా జలమయం అయ్యాయి. ఉరుములు మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులతో.. వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రోడ్లపై ఉన్న వాహనదారులు రోడ్ల మీద వర్షంలో తడిసి ముద్దయిపోయారు.
సరదాకు పోతే ఆగమాగమయ్యారు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మధ్యాహ్నం సెలవు కావటంతో.. నగరవాసులు చాలా మంది.. కుటుంబంతో కలిసి సరదాగా పార్కులు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వెళ్లారు. కుటుంబంతో కాలక్షేపం చేస్తున్న సమయంలో వర్షం తగులుకోవడంతో... జనాలు ఆగమయ్యారు. వర్షంలో ఎక్కడికి వెళ్లలేక నిండా తడిసి ముద్దయ్యారు.
రోడ్లపై ఉప్పొంగుతున్న వరద
చాలా సేపటి నుంచి కురుస్తున్న వర్షంతో.. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్, సనత్ నగర్, శేరిలింగంపల్లి, బోరబండ, మియాపూర్, లింగంపల్లి, కూకట్ పల్లి, బోయిన్ పల్లి, సికింద్రాబాద్, అల్వాల్, పటాన్‌చెరు, ఆర్సీపురం, అమీన్‌పూర్, హైటెక్‌సిటీలో వర్షం దంచి కొడుతోంది. ఫలితంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డిలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. గుమ్మడిదలలో అత్యధికంగా 9.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
భారీ వర్షం కారణంగా జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. రోడ్లపై ఉన్న వాళ్లు.. జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితిలో వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు. మ్యాన్‌హాల్స్ దగ్గర నీళ్లు వెళ్లేందుకు అడ్డంకులు తొలగిస్తున్నారు. ఏదైనా అనుకోని విపత్తు సంభవిస్తే వెంటనే 040-21111111, 9000113667కు ఫోన్ చేయాలని సూచించారు.
ఈ జిల్లాలకు హెచ్చరికలు
హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రేపు ఉదయం 8. 30 గంటల వరక ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, జనగాం, సిద్ధిపేట, భువనగిరి జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆగస్టు 21వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.