తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన జన్మదినం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా కేసీఆర్‌కు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. 68వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సీఎం కేసీఆర్ చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అనంతరం మోదీ కేసీఆర్‌కు ఫోన్‌ చేసి కూడా శుభాకాంక్షలు తెలిపారు.






‘‘పెద్ద పెద్ద కలలు కనే వ్యక్తికి, అసాధ్యాన్ని సాధ్యమయ్యే కళగా మార్చుకున్న వ్యక్తికి, దయతో నిండిన హృదయంతో అందర్నీ నడిపించే వ్యక్తికి, ధైర్యాన్ని నిర్వచించే, గడ్డు పరిస్థితులను సవాలు చేసే వ్యక్తికి, నా నాయకుడు, నా తండ్రి అని నేను గర్వంగా పిలుచుకునే వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు సుదీర్ఘకాలం జీవించాలి.’’ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.






‘‘తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సదా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.






రక్తదానం చేసిన మంత్రి హరీశ్ రావు
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని మంత్రి హరీశ్ రావు రక్త దానం చేశారు. నారాయణఖేడ్‌లోని ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన రక్త దాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ ప్రజలకు న్యాయం చేసే మంచి నాయకుడని, ఆయన నాయకత్వాన్ని తాము కూడా పుణికిపుచ్చుకుంటామని ట్వీట్ చేశారు. తాను రక్తదానం చేస్తున్న ఫోటోలను కూడా జత చేశారు. 






కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పాల్గొన్నారు.