జవహర్ నగర్ ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరో కీలక మైలురాయిని అధిగమించబోతున్నది. ఇప్పటికే వ్యర్ధాల నిర్వహణలో ఆదర్శంగా నిలుస్తున్న GHMC తాజాగా గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన లిక్విడ్ వేస్టుని (లీషెట్) శుద్ధిచేసే ప్రయత్నాలో విజయం సాధించబోతున్నది. శనివారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించబోయే ఈ లీషెట్ శుద్ధి నిర్వహణ ప్లాంటుతో భవిష్యత్తులో జవహర్ నగర్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి నీటి కాలుష్య సమస్య తలెత్తబోదు.


జవహర్ నగర్ డంప్ యార్డు కేంద్రంగా పేరుకుపోయిన లీషెట్ వల్ల దగ్గరలోని మల్కారం చెరువు వ్యర్ధ జలాలతో నిండిపోయింది. కొన్ని సందర్భాల్లో ఈ కలుషిత నీరు పొంగిపొరలడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు కాలుష్యం అవుతున్నాయి. ఈ సమస్యను ప్రభుత్వం సవాలుగా తీసుకుంది. స్వల్పకాలంలో కొన్ని చర్యలు చేపట్టడంతో పాటు దీర్ఘకాలంలో సమస్యకు సంపూర్ణంగా చెక్ పెట్టడం కోసం సమగ్రమైన ప్రణాళికను చేపట్టింది.


మొదటగా 2017లో మొబైల్ ఆర్వో సిస్టం ద్వారా రోజుకు 2వేల కిలో లీటర్ల కెపాసిటీతో కలిగిన పాక్షిక ట్రీట్మెంట్ పరిష్కారాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత దీన్ని రోజుకు 4000 కిలోలీటర్లకు పెంచారు. దీంతోపాటు వ్యర్థ జలాలు నిండిన మల్కారం చెరువులోని దాదాపు 11 లక్షల 60 లక్షల కిలోలీటర్ల నీటిని శుద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. దీంతోపాటు ఆ చెరువులోని వ్యర్ధ జలాలు పొంగిపొర్లకుండా సుమారు రూ. 4కోట్ల 35 లక్షలతో స్ట్రామ్ వాటర్ డైవర్షన్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. జవహర్ నగర్ డంప్ యార్డ్ పైనుంచి వచ్చే వరద నీటితో జరుగుతున్న కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టడం కోసం ముందుగా డంప్ యార్డ్ పైన క్యాపింగ్ పనులను చేపట్టారు.


2020 నాటికిడంప్ యార్డ్ క్యాపింగ్ పనులను GHMC పూర్తి చేసింది. దీని తర్వాత 2020లో సుమారు 250 కోట్ల రూపాయలతో జవహర్ నగర్ నుంచి వ్యర్థ జలాల ట్రీట్మెంట్, పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటల రిస్టోరేషన్ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. రిస్టోరేషన్, శుద్ధి కార్యక్రమాన్ని రాంకీ సంస్థ చేపట్టింది. దాదాపు సంవత్సర కాలంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే 43% మేర మల్కారం చెరువు శుద్ధి పూర్తయింది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న కాలుష్య నియంత్రణ మండలి లాంటి ఏజెన్సీలు కూడా ఈ అంశాన్ని ధ్రువీకరించాయి.


మల్కారం చెరువు జలాలను శుద్ధి చేయడం అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్న GHMC దాన్ని మూడుదశలుగా చేపట్టింది. ఇప్పటికే మొదటి దశలో భాగంగా 5.7 ఎకరాల మేర ఉన్న చెరువు నీటిని శుద్ధి చేశారు. వేగంగా పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అతి త్వరలో మల్కం చెరువు జలాలు పూర్తిగా శుద్ధి కానున్నాయి. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత జవహర్ నగర్ ప్రాంతంలో అటు ఘన వ్యర్ధాలతో పాటు జల వ్యర్ధాల నిర్వహణ కూడా సంపూర్ణ సంతృప్తి స్థాయికి చేరుతుంది దీంతో జవహర్ నగర్, పరిసర ప్రాంతాల్లో కాలుష్య సమస్య పూర్తిగా అదుపులోకి వస్తుంది. జవహర్ నగర్ డంపింగ్ యార్డులో నిర్మించిన లీషెట్ ట్రీట్‌మెంట్ ప్లాంటును మంత్రి కేటీఆర్ ప్రారంభించిన తర్వాత జవహర్ నగర్లో GO58 కింద లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తారు.