మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డికి చెందిన ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది సీబీఐ కోర్టు. ఉదయ్ కుమార్ ను సీబీఐ న్యాయమూర్తి నివాసంలో హాజరు పరిచారు సిబిఐ అధికారులు. ఉదయ్ కుమార్ కు మేజిస్ట్రేట్ రెండు వారాల పాటు రిమాండ్ విధించారు. న్యాయమూర్తి రిమాండ్ విధించిన నిర్ణయం అనంతరం ఉదయ్ కుమార్ ను చంచల్ గూడా జైలుకు తరలించారు పోలీసులు. మాసబ్ ట్యాంక్ లో న్యాయ మూర్తి నివాసం నుండి చంచల్ గూడా జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
రెండు వారాల రిమాండ్ కావడంతో ఈనెల 26 వరకు ఉదయ్ కుమార్ రెడ్డి జ్యుడీషియల్ రిమాండ్ కొనసాగుతోంది. మాజీ ఎంపీ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిపై కస్టడీ పిటిషన్ వేసింది సీబీఐ. ఉదయ్ తరుపు న్యాయవాది బెయిల్ మంజూరు చేయాలని మేజిస్ట్రేట్ ను కోరారు. కాగా, సోమవారం రోజు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది.
వైఎస్ వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ అరెస్ట్...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డికి చెందిన ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి, అతడి తండ్రి జయప్రకాశ్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. గూగుల్ టేక్ అవుట్ ద్వారా ఎంపీ తండ్రి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉదయ్ ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. పులివెందుల నుంచి కడప జైలు గెస్ట్ హౌస్‌కు ఉదయ్‌ను తీసుకెళ్లి ప్రశ్నిస్తోంది. సీఆర్‌పీసీ 161 కింద నోటీసులు ఇచ్చి సీబీఐ అధికారులు ఉదయ్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అనంతరం తండ్రి జయప్రకాశ్‌రెడ్డి, ఆయన న్యాయవాది సమక్షంలోనే అరెస్టు చేశారు.
ఉదయ్ అరెస్టు మెమోనూ అతని కుటుంబ సభ్యులకు సీబీఐ అప్పగించింది. తర్వాత కడప నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు ఉదయ్ కుమార్ రెడ్డిని తరలించారు. హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఉదయ్‌ను హాజరుపరిచే అవకాశం ఉంది. తుమ్మలపల్లి యురేనియం కర్మాగారంలో ఉదయ్‌కుమార్ రెడ్డి పని చేస్తున్నారు. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌పై గతంలో కడప కోర్టులో ప్రైవేటు కేసు వేశారు ఈయన. ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు రామ్ సింగ్‌పై రిమ్స్ పోలీసులు గతేడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేశారు. ఈ నెల 30లోపు వివేకా హత్య కేసు విచారణ పూర్తి చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు దూకుడు పెంచిన సీబీఐ అధికారులు ఈ రోజు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు అవినాష్, శివశంకర్ రెడ్డితో పాటు ఘటనాస్థలానికి ఉదయ్ వెళ్లినట్లు, ఆ రోజు అంబులెన్స్, ఫ్రీజర్, డాక్టర్లను రప్పించడంలో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ భావిస్తోంది. వివేకా మృత దేహానికి ఉదయ్ తండ్రి జయప్రకాశ్ రెడ్డి బ్యాండేజ్ కట్లు కట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉదయ్‌ను గతంలో పలుమార్లు సీబీఐ అధికారులు ప్రశ్నించారు.