CBI Summons Kejriwal:


కేజ్రీవాల్‌కు సమన్లు 


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. లిక్కర్‌ పాలసీ కేసు విచారణలో భాగంగా ఏప్రిల్ 16న ఢిల్లీలోని హెడ్‌క్వార్టర్స్‌కు రావాలని నోటీసులు పంపింది. ఇప్పటికే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఇదే కేసులో అరెస్ట్ చేశారు. జైల్లోనే విచారణ కొనసాగిస్తున్నారు ఈడీ అధికారులు. కీలకమైన వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సీబీఐ సమన్లపై కేజ్రీవాల్ స్పందించారు. ట్విటర్ వేదికగా ఈ వేధింపులు ఆగవు అంటూ ట్వీట్ చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతానంటూ పోస్ట్ చేశారు. ఈ సమన్లు రాకముందు రోజే అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


"దేశంలో ఎన్నో జాతి వ్యతిరేక శక్తులున్నాయి. దేశం అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నాయి. పేదలకు మెరుగైన విద్య అందించడం వాళ్లకు ఇష్టం లేదు. దేశ ప్రజలు పురోగతి సాధించడం వాళ్లకు నచ్చడం లేదు. వీళ్లంతా కలిసి సిసోడియాను జైలుకు పంపారు. ఆయనను కటకటాల పాలు చేసిన వాళ్లంతా దేశానికి శత్రువులే. విద్యను పేద విద్యార్థులందరికీ అందించాలనుకున్న వ్యక్తిని ఆ డిక్టేటర్ (ప్రధాని మోదీ) జైలుకు పంపారు. ఇది ప్రజలు గుర్తు పెట్టుకుంటారు" 


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి