Gannavaram News : కృష్ణా జిల్లా గన్నవరంలో పుంగనూరు ఆవు దూడకు ఉయ్యాల వేడుక నిర్వహించారు ఓ దంపతులు. గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ కి చెందిన నందిగాం వెంకట నారాయణ, లలిత దేవి దంపతులకు పశుపోషణ అంటే మక్కువ. వారు ఆప్యాయంగా పెంచుకుంటున్న పుంగనూరు అవుకు పెయ్య దూడ జన్మించటంతో చాలా ఆనందపడ్డారు.  ఆ పెయ్య దూడకు 22 రోజు తరువాత ఉయ్యాల వేడుక నిర్వహించారు. ఉదయాన్నే దూడకి స్నానం చేయించి కొత్త చీర అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు. ప్రత్యేకంగా అలంకరించిన ఉయ్యాలలో ఆవు దూడను ఉంచి గౌరీ అని నామకరణం చేశారు ఆ దంపతులు. నాలుగేళ్ల  క్రితం 30 వేలకు పుంగనూరు ఆవును కొనుగోలు చేసినట్లు వెంకట నారాయణ దంపతులు తెలిపారు. గత ఏడాది ఆవుకి గిత్త దూడ పుట్టింది. ఈసారి పెయ్య దూడ జన్మించటంతో వెంకట నారాయణ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ఆవుదూడ ఉయ్యాల వేడుక చూడటానికి స్థానికులు తరలివచ్చారు. 



పుంగనూరు ఆవులు స్పెషల్ 


 కేవలం మూడు అడుగుల పొడవు మాత్రమే ఉండే పుంగనూరు ఆవులు ఏపీలో ఫేమస్. మూడు అడుగుల పొడవే ఉన్న వీటి ధర మాత్రం మూడు నుంచి ఐదు లక్షలు పలకుతోంది.  పుంగనూరు ఆవులు దేశంలోనే ప్రత్యేకమైనవిగా చెబుతారు. ప్రపంచ దేశాల్లో అనేక రకాల ఆవులు ఉన్నా పుంగనూరు ఆవులకు ఉన్న స్పెషాలిటీ మరే ఆవులకూ లేదంటారు. సాధారణ ఆవులు మాదిరిలా కాకుండా ఈ ఆవులు కేవలం మూడు అడుగుల పొడవు మాత్రమే ఉంటాయి. చాలా ముద్దుగా, అందంగా ఉంటాయి. పుంగనూరు ఆవులకు వాసన పసిగట్టే సామర్థ్యం ఉంటుంది. దీంతో అవి ఎక్కడికి వెళ్లినా కూడా తిరిగి అదే మార్గంలో వెనక్కి వచ్చేయగలగడం వీటి ప్రత్యేకత అంటారు. ఈ జాతి ఆవులు ఎంతటి ఎండనైనా, ఎలాంటి చలి వాతావరణాన్ని అయినా తట్టుకుని జీవించగలవు. పుంగనూరు ఆవు కాళ్లు పొట్టిగా ఉండి, ఎత్తు 70 నుంచి 90 సెంటీమీటర్లు ఉంటాయి. సాధారణంగా ఈ ఆవులు 2 అడుగుల 4 అంగుళాల నుంచి 3 అడుగుల ఎత్తు పెరుగుతాయి. సాధారణంగా 250 కేజీల బరువు కలిగి ఉంటాయి.  


లక్ష్మీస్వరూపంగా 


ఆకారంలో చిన్నగా ఉండి పెద్దగోపురం కలిగి ఉండటంతో పుంగనూరు ఆవులను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆ ఆవులను నిత్యం పూజిస్తే ఐశ్వర్య ఆరోగ్యాలు సిద్ధిస్తాయని చాలా నమ్ముతారు. పుంగనూరు ఆవు పాలకు ఔషధ గుణాలు ఉన్నాయంటారు. సాధారణ ఆవు పాలతో పోలిస్తే వీటి పాలలో వెన్నశాతం ఆరు నుంచి ఎనిమిది శాతం వరకూ ఉంటుందని రైతులు తెలిపారు. అంతరించిపోతున్న పుంగనూరు జాతి ఆవులను కాపాడుకోవాలని రైతులు కోరుతున్నారు. పుంగనూరు ఆవులు పొట్టిగా మూడు అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతాయి. అంతేకాదు ఇవి తక్కువ పాలు ఇచ్చినా..... వెన్న శాతం ఎక్కువగా ఉంటుందని రైతులు చెబుతారు. ఈ ఆవులు ఇంట్లో ఉంటే మంచిదని చాలా మంది విశ్వసిస్తారు.  ఏపీలో చాలా మంది పుంగనూరు ఆవులను ప్రత్యేక శ్రద్ధతో పోషిస్తున్నారు. తమ ఇంట్లో కుటుంబ సభ్యులుగా ఈ ఆవులను పెంచుకుంటారు.