YS Sharmila to gift Ambedkars Constitution book to KCR: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మరో గిఫ్ట్ రెడీ చేశారు. రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని భారత రాజ్యాంగం పుస్తకాన్ని సీఎం కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇచ్చేందుకు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం అయితే ఏర్పడింది కానీ, రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని షర్మిల ఆరోపించారు. అందుకే సీఎం కేసీఆర్ కు రాజ్యాంగం పుస్తకాన్ని పంపిస్తున్నామని, ఇకనుంచైనా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదివి, తెలంగాణలో అమలు చేయాలని షర్మిల కోరారు.
రాజ్యాంగ నిర్మాత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ కు వెళ్లి అక్కడి అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ పాలనపై విమర్శలు కురిపించారు. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి, భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి డా.బీఆర్ అంబేద్కర్ అన్నారు. ఆ మహనీయుడి స్ఫూర్తితోనే YSRTP పనిచేస్తుందన్నారు షర్మిల.
‘80వేల పుస్తకాలు చదివిన అపర మేధావి కేసీఆర్ గారు, మేము పంపిన రాజ్యాంగ పుస్తకాన్ని తీరిగ్గా చదివి, రాష్ట్రంలో డా. బీఆర్ అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుతున్నా. నియంత పాలన మానుకొని, ప్రజలకు సమాన హక్కులు.. ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కులు కల్పించాలని మనవి’ చేస్తున్నాం అన్నారు.
అంబేద్కర్ రాజ్యాంగాన్ని కేసీఆర్ చదవలేదు..
తెలంగాణ సీఎం కేసీఆర్ నియంతగా పరిపాలించడానికి వైఎస్ షర్మిల ఆసక్తికర కారణం చెప్పారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదవని కారణంగానే కేసీఆర్ నియంతగా పరిపాలన చేస్తున్నారని షర్మిల సెటైర్లు వేశారు. కేసీఆర్ ఎన్నో వేల పుస్తకాలు చదివారు కానీ, రాజ్యాంగం చదవలేదు. అందుకే రాజ్యాంగం పుస్తకాన్ని సీఎం కేసీఆర్ కు బహుమతిగా పంపుతున్నాం అన్నారు. స్వయంగా తానే అంబేద్కర్ విగ్రహం వరకు నడుచుకుంటూ వెళ్లి సీఎం కేసీఆర్ కు రాజ్యాంగం పుస్తకాన్ని ఇస్తా అన్నారు. రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ లా కాకుండా భారతదేశ రాష్ట్రంలా పాలించాలని షర్మిల కోరారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజధాని నగరంలో విగ్రహావిష్కరణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 14న మధ్యాహ్నం మూడు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలంటూ హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న అఖిల భారత సర్వీస్ అధికారులందరినీ తెలంగాణ సర్కార్ ఆదేశించింది. దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పూర్తయ్యింది. భారతావనికే తలమానికంగా నిలిచే ఈ నిర్మాణానికి ప్రత్యేకత సంతరించుకుంది.